ఢిల్లీ, సాక్షి: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. ప్రపంచంలో అత్యధిక ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపుగా 97 కోట్ల మంది ఓటు నమోదు చేయించుకున్నారని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు విడుదల చేసింది. తద్వారా గత లోక్‌సభ ఎన్నికల ఓటర్ల కంటే.. ఆరుశాతం ఎక్కువ ఓటు రిజిస్ట్రేషన్ నమోదైందని ఈసీ స్పష్టం చేసింది.
పుణేలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో ఈ వివరాల్ని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఓటర్లు 96.88 కోట్ల మంది .. భారతదేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు అని సీఈసీ తెలిపారు. ఇక.. ఇందులో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి.. పురుషుల కంటే మహిళలు అత్యధికంగా ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని ఈసీ ప్రముఖంగా పేర్కొంది.
మహిళలతో పాటు ఈసారి యువత సైతం ఓటు కోసం నమోదు భారీ సంఖ్యలోనే చేసుకుంది. ఇక లింగ నిష్పత్తి చూస్తే(1000:..) 2023లో 928 ఉండగా.. 2024 నాటికి(డ్రాఫ్ట్ కంటే అధికంగా నమోదు) అది 948కి చేరింది. ఇక.. ఈసారి దేశ యువతలో(18-29 మధ్య వయసువాళ్లు) రెండు కోట్ల మంది ఓటర్ల జాబితాలో చేరారు. మొత్తం 2.63 కోట్ల కొత్త ఓటర్లలో .. 1.41 కోట్లు మహిళలు కావడం గమనార్హం. అంటే.. మిగిలిన 1.22 కోట్ల పురుష ఓటర్ల కంటే అధికమన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment