డెహ్రాడూన్: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతి కాస్త తగ్గింది. గడిచిన రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా సుమారు మూడు లక్షల వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో మహ కుంభమేళా స్నానాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కుంభమేళాకు వచ్చే భక్తులు కచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించింది. కాగా కుంభమేళాలో కరోనా టెస్టుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తోంది.
కుంభమేళా సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సుమారు 4 లక్షల మేర కరోనా టెస్టులు చేయగా అందులో సుమారు ఒక లక్ష వరకు కరోనా ఫేక్ రిపోర్ట్‌లను ఇచ్చారని తేలింది. పరీక్షలు చేయకుండానే కరోనా టెస్టు రిపోర్టులు జారీ చేశారని బయటపడింది. ఒకనొక సందర్భంలో ఒకే ఫోన్ నంబర్‌ను వినియోగించి సుమారు 50 మందికి టెస్టులు నిర్వహించారు. అంతేకాకుండా కరోనా టెస్టులు చేసుకున్నవారి సమాచారం పూర్తిగా ఫేక్ అని తేలింది. హరిద్వార్‌లోని ఒకే ఇంటి చిరునామాను ఉపయోగించి సుమారు ఐదు వందల మందికి కరోనా టెస్టులను నిర్వహించారు. కరోనా టెస్టుల్లో ఓ ప్రైవేటు ఎజెన్సీ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. డేటాఎంట్రీ ఆపరేటర్లతో,విద్యార్థులతో టెస్టులు నిర్వహించారు.
ఫేక్ రిపోర్టుల విషయంపై కుంభమేళా హెల్త్ ఆఫీసర్ అర్జున్ సింగ్ సెనగర్ స్పందించారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతుందని తెలిపారు. టెస్టుల విషయంలో కొన్ని అవకతవకలు జరిగినట్లుగా గుర్తించామని తెలిపారు.15 రోజుల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదికను అందిస్తామని హెల్త్ సెక్రటరీ అమిత్ నేగి పేర్కొన్నారు. కరోనా టెస్టులపై సమగ్ర విచారణ పూర్తి అయ్యేంత వరకు ప్రైవేటు ఎజెన్సీలకు చెల్లింపులను నిలిపివేయాలని హరిద్వార్ మేజిస్ట్రేట్ కోర్టు తెలిపింది.
(చదవండి: సెకండ్ వేవ్: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment