ప్రతిపక్షాల భేటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏఐఎమ్‌ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్ధీన్ ఓవైసీ. ఈ సమావేశానికి హాజరైన నాయకుల చరిత్ర ఏంటో తెలుసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందనేది సత్యం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీని గద‍్దె దింపడానికి ఐక్యమత్యంగా పోరాడటం సరైన విధమే అయినప్పటికీ భేటీ జరిగిన ప్రదేశం, నేతృత్వం వహించిన నాయకుల తీరును ఆయన ఆక్షేపించారు.
'నితీష్ చరిత్ర ఎటువంటిది..?'
ప్రతిపక్షాలకు నేతృత్వం వహించిన నితీష్ కుమార్ గత ఏడాది వరకూ బీజేపీతో కలిసి మహాఘట్ బంధన్‌గా ఏర్పడి ప్రభుత్వాన్ని పంచుకున్న వ్యక్తేనని ఓవైసీ గుర్తుచేశారు. అధికారం కోసం బీజేపీ నుంచి విడిపోయి.. మళ్లీ కలిసి.. మళ్లీ విడిపోయిన చరిత్ర ఆయనదని అన్నారు. గోద్రా అల్లర్లు జరిగినప్పుడు రైల‍్వే మంత్రిగా నితీష్ ఉన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. గుజరాత్‌లో మారణకాండ జరిగిన కాలంలో బీజేపీతో నితీష్ కలిసి ఉన్నారని ఓవైసీ అన్నారు.
'ఉద్ధవ్, కేజ్రీవాల్ ఎలాంటివారు..?'
'ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన లౌకిక పార్టీనా? బాబ‍్రీ మజీద్‌ను కూలదోయడం మేము గర్వంగా భావిస్తున్నామని అన్నది ఉద్ధవ్ ఠాక్రే కాదా? రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలపలేదా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు నేతృత్వం వహించేది ఎవరు?' అని ఓవైసీ ప్రశ్నించారు. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే 540 సీట్లలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయాల్సిన అవసరం ఉందని ఓవేసీ చెప్పారు.
ప్రతిపక్షాల భేటీ..
పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష‍్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పట్నాలో ముగిసిన ప్రతిపక్షాల సమావేశం.. సిమ్లాలో మరోసారి భేటీకి నిర్ణయం..
Comments
Please login to add a commentAdd a comment