
రాసిన లేఖలను పోస్టాఫీసు బాక్స్‌లో వేస్తున్న విద్యార్ధులు నెట్‌వర్క్ సౌకర్యాలను కల్పించాలని రాసిన లేఖను చూపిస్తున్న విద్యార్ధిని
భువనేశ్వర్ : కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న తమకు నెట్‌వర్క్ సదుపాయం కల్పిఇంచాలని తొమ్మిది గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు లేఖలు రాశారు. మీరావలి, దుర్గాపాడు, పిప్పిలిగుడ, కారుడాయి, బొడొ అలుబడి, కూలి, బాయిసింగి, డంగలొడి, హలువ గ్రామాలకు చెందిన విద్యార్థులు పీఎం, సీఎంకు తాము రాసిన రెండు లేఖలను మంగళవారం మీరావలి పోస్టాఫీసులో పోస్ట్ చేశారు. కరోన కారణంగా విద్యాలయాలు మూతపడడంతో, విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆన్‌లైన్‌లో బోధనకు చర్యలు చేపట్టింది. అయితే, రాయగడ సమితిలోని తొమ్మిది పంచాయితీల్లో ఎటువంటి నెట్‌వర్క్ లేకపోవడంతో ఆయా గ్రామాల విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలకు దూరంగా ఉంటున్నారు.
తమ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సౌకర్యాలు కల్పించండని అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదని, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ప్రాంత విద్యార్థులంతా లేఖల ద్వారా తమ సమస్యను ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులకు తెలియజేసే ప్రయత్నం చేశారు. జీమిడిపేట ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న రెహాన బచేలి స్వయంగా ఈ లేఖలను పోస్ట్ చేశారు. జిల్లాలొ అత్యధికంగా ఆదివాశీలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో నెట్‌వర్క్ లేకపొవడం వలన.. ఇటు చదువుకు గండి పడుతుండటమే కాకుండా, అత్యవసర సమయంలో వైద్యసేవలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారనే ఆశతో తామంతా పీఎం, సీఎంకు లేఖలు రాసి తమ సమస్యలను తెలియజే ప్రయత్నం చేశామని విద్యార్థులు అంటున్నారు.
రానున్న పంచాయితీ ఎన్నికలు బహిష్కరిస్తాం
విద్యార్థుల చదువు కోసం అవసరమైన నెట్‌వర్క్ సదుపాయం కల్పించకుంటే, రానున్న పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని తొమ్మిది పంచాయతీలకు చెందిన ప్రజలు విలేకర్లతో చెప్పారు. అయిదు సార్లు విజయం సాధిస్తూ వస్తున్న అధికార బీజేడీ పార్టీ ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు ఎటవంటి శ్రధ్ద వహించడం లేదని స్థానికుడైన కాంతారావు బచేలి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment