పీహెచ్‌సీకి తాళం వేసి ఆందోళన చేస్తున్న గ్రామస్తులు
జయపురం: పదేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించి కొత్తవారిని చేర్చుకున్నందుకు ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు, గ్రామస్తులు ఆగ్రహించి ప్రాథమిక వైద్య కేంద్రానికి బుధవారం తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. చివరికి ఎమ్మెల్యే హామీతో ఆందోళన విరమించారు. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ సమితి గుమగుడ గ్రామం పీహెచ్‌సీలో 10 సంవత్సరాలుగా నైట్ వాచ్‌మన్‌గా దుర్యోధన హరిజన్, స్వీపర్‌గా ధనమతి గౌడ పనిచేస్తున్నారు. వారిద్దరినీ తొలగించి కొత్త వారిని కాంట్రాక్టర్ ఆ పోస్టుల్లో నియమించాడు.
కొత్తగా నియామకం పొందిన వారు హాస్పిటల్‌కు రావడంతో గ్రామ ప్రజల సహకారంతో బాధిత ఉద్యోగులు హాస్పిటల్ గేట్‌కు తాళాలు వేశారు. దీంతో డాక్టర్లు, సిబ్బంది లోపలే ఉండిపోయారు. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న డాబుగాం ఎమ్మెల్యే మనోహర రొంధారి కారు ఆపి విషయం తెలుసుకున్నారు. వెంటనే నవరంగపూర్ వైధ్యాధికారులు, డీఆర్‌డీఏ పీడీతో ఫోన్‌లో విధుల నుంచి తొలగించిన వారిని మళ్లీ చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా ఉద్యోగాలలో చేర్చుకుంటామని బాధితులకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హాస్పిటల్ తాళాలు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment