
న్యూఢిల్లీ: భారత్‌లోని 718 జిల్లాలకుగాను 500కుపైగా జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని డౌన్ టు ఎర్త్ అనే సంస్థ అంచనావేసింది. భారత్‌లో పర్యావరణ సంబంధ రాజకీయాలు, అభివృద్ధిపై ఈ సంస్థ పరిశోధన చేస్తోంది. భారత్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై డౌన్ టు ఎర్త్ సంస్థ ఒక నివేదిక విడుదలచేసింది. నివేదిక ప్రకారం..
► 718 జిల్లాలకుగాను 500 జిల్లాల్లో అంటే 70శాతానికిపైగా భూభాగంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి.
► ఈశాన్య భారతం, తూర్పుభారతంలో కొన్ని ప్రాంతాలు, జమ్మూ కశీ్మర్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం సహా దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో మధ్యస్థ/తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
► ‘ఈసారి రుతుపవనకాలంలో ఆగస్టులో ప్రతి రోజూ కురవాల్సిన వర్షాలు ఆగి ఆగి కొద్దిరోజులు విరామాలు ఇస్తూ పడ్డాయి. ఇలా ‘బ్రేక్’లు ఇస్తూ పడిన వర్షాలే భారత్‌లో కరువుకు 70 శాతం కారణం’ అని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ చెప్పారు.
► 53 శాతం జిల్లాల్లో మధ్యస్థ కరువు పరిస్థితులు ఉన్నాయి.
► ఈ ఏడాది ఆగస్టులో ఎక్కువ రోజులు వర్షాలు పడనేలేదు. ఏడో తేదీ నుంచి 18వ తేదీ వరకు పొడి వాతావరణం నెలకొంది. ఈనెలలో ఇన్ని రోజులపాటు వర్షాలు లేకపోవడం అనేది 21వ శతాబ్దిలో మూడో అతిపెద్ద విరామంగా రికార్డులకెక్కింది. గత 123 సంవత్సరాల చరిత్రలో ఆగస్టులో ఇంతటి పొడివాతావరణం నెలకొనడమూ ఇదే తొలిసారి.
► ‘2022 ఏడాదిలో పోలిస్తే 2023లో సాగు విస్తీర్ణం 33 శాతం పెరిగినా.. తగ్గిన వర్షాల కారణంగా దిగుబడి పెరుగుతుందో, తగ్గుతుందో చెప్పలేని పరిస్థితి’ అని క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ పేర్కొంది.
► ప్రతిఏటా ‘సాధారణ వర్షపాతం’ కేటగిరీ కింద ఉండే దాదాపు 20 రాష్ట్రాల్లో ఈసారి సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవడం గమనార్హం.
► 1971–2020 సుదీర్ఘకాలం నుంచి చూస్తే ఈసారి వర్షపాతంలో లోటు ఐదు శాతం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment