ఆర్థిక ఇబ్బందుల్లో పద్మనాభ దేవాలయం | Padmanabhaswamy Temple Facing Great Financial Constraints | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందుల్లో పద్మనాభ దేవాలయం

Published Sat, Sep 18 2021 2:55 PM | Last Updated on Sat, Sep 18 2021 3:35 PM

Padmanabhaswamy Temple Facing Great Financial Constraints - Sakshi

న్యూఢిల్లీ: ప్రసిద్ధిగాంచిన పద్మనాభ స్వామి దేవాలయం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉందని, స్వామికి వచ్చే కానుకలు నిర్వహణా వ్యయాలకు చాలడం లేదని గుడి నిర్వహణా కమిటీ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ట్రావెన్కోర్‌ రాజ కుటుంబం నడిపే దేవస్థాన ట్రస్టుపై ఆడిట్‌ నిర్వహించాలని కోరింది. కేరళలోని ఈ ప్రఖ్యాత దేవాలయం నిర్వహణకు నెలకు రూ.1.25 కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే తమకు గరిష్టంగా 60-70 లక్షల రూపాయలే వస్తున్నాయని, ఈ విషయమై తగు సూచనలివ్వాలని కమిటీ తరఫు న్యాయవాది బసంత్‌ కోర్టును అభ్యర్థించారు.

సొమ్ములు లేకపోవడంతో నిర్వహణ క్లిష్టంగా మారిందని, నిధులపై వివరాలు తెలుసుకుందామని ఆడిట్‌ కోసం కోరితే ట్రస్టు స్పందించడంలేదని తెలిపారు. టస్ట్రు వద్ద రూ.2.87 కోట్ల నగదు, 1.95 కోట్ల ఆస్తులు ఉన్నట్లు 2013 ఆడిట్‌ నివేదిక తెలియజేస్తోందని, ఇప్పుడు ట్రస్టు వద్ద ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఆడిట్‌ జరపాలని కోరారు. గతంలో సుప్రీం ఆదేశాల మేరకే ట్రస్టు ఏర్పడిందని, దేవస్థానానికి ట్రస్టు తప్పక సాయం చేయాలనే విషయాన్ని గుర్తు చేశారు.

చదవండి: మూగజీవాల రక్షకుడు.. 8వేల కుక్కలను కాపాడిన భిక్షువు..

రాజకుటుంబ ట్రస్టు
పద్మనాభస్వామి ట్రస్టు రాజకుటుంబం ఏర్పరిచిన పబ్లిక్‌ ట్రస్టని, దానికి ఆలయ నిర్వహణకు ఎలాంటి సంబంధం లేదని ట్రస్టు తరఫు న్యాయవాది అరవింద్‌ వాదించారు. గుళ్లో పూజలు, ఆచారాలను పర్యవేక్షించడానికి ట్రస్టు పరిమితమని, సుప్రీంకోర్టు అమికస్‌ క్యూరి కోరినందునే గతంలో ఆడిట్‌ జరిగిందని చెప్పారు. గుడికి, ట్రస్టుకు సంబంధం లేనందున ఆడిట్‌ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తమది స్వతంత్ర కమిటీ అని, ట్రస్టుపై కమిటీ ఆధిపత్యానికి అంగీకరించమని తెలిపారు. సంవత్సరాలుగా కమిటీ, ట్రస్టు మధ్య వివాదం ఉందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. దేవస్థానం రోజూవారీ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని, ఈ విషయంలో సంబంధిత అథారీ్టలను సంప్రదించాలని సూచించింది.

ఆడిట్‌ నుంచి మినహాయించాలన్న ట్రస్టు అభ్యర్ధనపై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. 2011లో గుడికి స్వతంత్ర ట్రస్టును ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పరచాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసి, రాజ కుటుంబానికి గుడి నిర్వహణపై హక్కును పునరుద్ధరించింది. అనంతరం గుడికి సంబంధించి 25ఏళ్ల ఆదాయవ్యయాలను ఆడిట్‌ చేయాలని నిర్వహణ కమిటీకి సూచించింది. అయితే ఆడిట్‌కు ట్రస్టు ఆంగీకరించడంలేదు. దీంతో 9ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. 
చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద వృక్షాన్ని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement