అంతర్గత కుమ్ములాటలతో కప్పల తక్కెడగా మారిన అన్నాడీఎంకేలో పరిణామాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. బుధవారం కోర్టు తీర్పుతో మళ్లీ పార్టీ కనీ్వనర్, కోశాధికారిగా గుర్తింపు దక్కడంతో పన్నీరు శిబిరం ఆనంద తావడం చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పన్నీరు.. తన ప్రత్యర్థి పళని స్వామికి కీలక సూచన చేశారు. ఏక, జంట నాయకత్వానికి స్వస్తి పలికి ఉమ్మడిగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అందరూ ఏకం కావాల్సిన సమయం అసన్నమైందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఊసరవెళ్లి తరహాలో రంగులు మార్చే పన్నీరు సెల్వంతో కలిసి ప్రయాణించే అవకాశమే లేదని పళని స్వామి తేలి్చచెప్పారు.
సాక్షి, చెన్నై : ‘గొడవలు వద్దు..ఐక్యతే ముద్దు, జంట , ఏక నాయకత్వాలు వద్దు ఉమ్మడిగా పార్టీని బలోపేతం చేద్దాం..’’ అని పళని స్వామికి పన్నీరు సెల్వం పిలుపు నిచ్చారు. అలాగే, చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్‌కూ ఆహ్వానం పలికారు. అయితే, పన్నీరు పిలుపును పళని తిరస్కరించారు. కలిసి పనిచేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.
కీలక మలుపు..
అన్నాడీఎంకే అగ్ర నేతలు పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదాల ఎపిసోడ్ బుధవారం కీలక మలుపు తిరిగింది. జూలై 11వ తేదీన పళని నిర్వహించిన సర్వ సభ్య సమావేశానికి వ్యతిరేకంగా పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సర్వ సభ్య సమావేశం చెల్లదని తేల్చింది. జూన్ 23వ తేదీ నాటి పరిస్థితులనే యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. దీంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపిక చెల్లకుండా పోయింది. అలాగే, అన్నాడీఎంకేలో రెండు గ్రూపులుగా ఏర్పడ్డ పళని, పన్నీరు తమ వాళ్లకు పదవులు కట్ట బెడుతూ జారీ చేసిన ఉత్తర్వులు అన్నీ చెల్లని కాగితాలయ్యాయి.
అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కోశాధికారి పదవులు కోర్టు తీర్పుతో మళ్లీ పన్నీరు చేతికి చిక్కాయి. పళని కేవలంలో పార్టీ సమన్వయ కమిటీ కో– కన్వీనర్‌గా మిగలాల్సిన పరిస్థితి. కోర్టు తీర్పు పన్నీరు శిబిరంలో ఆనందాన్ని నింపితే, పళని శిబిరాన్ని నిరాశకు గురి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు శిబిరాలు వేర్వేరుగా గురువారం సమావేశాల్లో మునిగాయి. తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, పన్నీరు సెల్వం ఇచ్చిన పిలుపు అన్నాడీఎంకే రాజకీయాలను ఆసక్తికరం చేశాయి. పళణితో సామరస్యానికి పన్నీరు ముందుకు రావడమే కాకుండా, చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి దినకర్‌ను కూడా పారీ్టలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.
చేతులు కలుపుదాం..
పన్నీరు సెల్వం తన ప్రసంగంలో ప్రియ మిత్రమా చేతులు కలుపుదాం.. కలిసి పనిచేద్దాం అని పిలుపు నిచ్చారు. ఇన్నాళ్లూ మనస్సులో ఉన్న చేదు అనుభవాలు, బాధలు, భేదాలు, వివాదాలను పక్కన పెట్టేద్దామని సూచించారు. అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో సీఎం పగ్గాలు చేపట్టిన పళని స్వామికి నాలుగున్నరేళ్ల సంపూర్ణ సహకారం అందించామని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు ఏక నాయకత్వం అంటే, అంగీకరించే ప్రసక్తే లేదని, అయితే, ఉమ్మడి నాయకత్వంతో అందరం కలిసి కట్టుగా ఐక్యతను చాటుదామని పిలుపు నిచ్చారు.
అన్నాడీఎంకేలో ఒకే ఎజెండా మాత్రమే ఉందని, అది ఒక్క ఐక్యత మాత్రమేనని పేర్కొన్నారు. సమష్టిగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపు నిచ్చారు. అందరూ అంటే, చిన్నమ్మ శశికళ, దినకరన్‌ను కూడా ఆహా్వనిస్తున్నారా..? అని ప్రశ్నించగా, అవును అని సమాధానం ఇచ్చారు. అందరూ మళ్లీ పారీ్టలోకి రావాలని, కలిసి కట్టుగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అమ్మ జీవించి ఉన్న కాలంలో పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించి, ఇప్పుడు దూరంగా ఉన్న వారు సైతం రావాలని, అందరూ ఉమ్మడి ప్రయాణం ప్రారంభించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
అప్పీల్‌కు పళని..
అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం వ్యవహారంలో ప్రత్యేక బెంచ్ బుధవారం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పళని స్వామి తరపున మద్రాసు హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది విజయనారాయణన్ ఈ పిటిషన్ వేశారు. దీనిని న్యాయమూర్తులు ఎం. దురైస్వామి, సుందర్‌మోహన్ బెంచ్ విచారణకు స్వీకరించింది. అయితే, సోమవారం నుంచి విచారణ చేపడుతామని ప్రకటించింది.
ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తాళాన్ని పళనిస్వామికి అప్పగించిన వ్యవహారంలో పన్నీరు సెల్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. తాళం కోసం పన్నీరు తరపు న్యాయవాదులు తీవ్రంగానే వాదనలు వినిపించారు. పళని స్వామికి తాళం అప్పగిస్తూ హైకోర్టు ఇప్పటికే ఇచ్చి న ఉత్తర్వులకు స్టే విధించాలని కోరారు. అయితే, సుప్రీంకోర్టు స్టేకు నిరాకరించింది. వివరణ ఇవ్వా లని పళని స్వామికి నోటీసులు జారీ చేసింది.
అంగీకరించే ప్రసక్తే లేదు..
పళని స్వామి మీడియాతో మాట్లాడుతూ, పన్నీరు ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ధర్మయుద్ధం అంటూ గతంలో గళం వినిపించిన పన్నీరు, ఇప్పుడు ఆ యుద్ధాన్ని పక్కన పెట్టేశారా? అని ప్రశ్నించారు. వాళ్లను కూడా పారీ్టలోకి ఆహా్వనిస్తుండడం చూస్తే, ఆయన ధర్మయుద్ధం ఎవరి కోసం చేసినట్లో అర్థం అవుతోందని మండిపడ్డారు. ఆయనకు పదవీ కాంక్ష ఎక్కువని, శ్రమించకుండా ఉన్నత పదవుల్లో కూర్చోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. పార్టీ కన్నా, కుటుంబమే ఆయనకు ముఖ్యమని, అందుకే ఆయన తనయుడికి కేంద్ర మంత్రి పదవి కోసం గతంలో పట్టుబట్టారని గుర్తు చేశారు.
గూండాలతో, రౌడీలతో, పోలీసు భద్రతతో వెళ్లి పార్టీ కార్యాలయం పరువును బజారుకీడ్చారని, కేడర్‌ను కొట్టించిన పన్నీరుతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏక నాయకత్వం తన వ్యక్తిగతం కాదని, కార్యకర్తలందరి అభీష్టం అని స్పష్టం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే, పార్టీ సర్వ సభ్య సమావేశంలో చర్చించుకోవాలే గానీ, అనాగరికంగా వ్యవహరించడం సమంజసమా..? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: బిహార్ పరిణామాలు.. కేంద్రంలో అధికార మార్పునకు సంకేతం
Comments
Please login to add a commentAdd a comment