LIVE UPDATES
07:01PM
► లోక్‌సభ రేపటికి ( మంగళవారం) వాయిదా
►దొంగే దొంగ అని అరిచినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ధాన్యం సేకరణ ఒప్పందాన్ని కేసీఆర్ తుంగలోతొక్కారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుతో నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.
►ఇటీవల ఏపీలో సంభవించిన వరదల వల్ల 1.85 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగిందని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మార్గాణి భరత్ అన్నారు. లోక్‌సభలో వరదనష్టంపై మాట్లాడిన ఆయన.. కేంద్ర బృందం అంచనాల ప్రకారం దాదాపు 6 వేల కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. వరదల సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు.
►కిసాన్ రైళ్ల వ్యవస్థ రైతాంగానికి ఎంతో మేలు చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ అన్నారు. లోక్‌సభలో ప్రజా ప్రాముఖ్యత విషయాల చర్చ సందర్భంగా రైతు సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. కిసాన్ రైలు రవాణా వినియోగించుకుంటున్న రైతులకు ఇస్తున్న సబ్సిడీని ఏడాదికి 150 కోట్ల రూపాయలకు పెంచాలని కోరారు.
► లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తిప్పికొట్టారు. బ్యాంకులను మోసం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన రఘురామకృష్ణంరాజుపై రెండు సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ థర్మల్ పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
►లోక్‌సభలో నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అమెండ్మెంట్ బిల్లును కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై లోక్‌సభ సభ్యులు చర్చించారు. కొవిడ్ ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ సింగారి అన్నారు.
04:38PM
► రాజ్యసభ రేపటికి వాయిదా
03:40 PM
► లోక్‌సభలో నాగాలాండ్ ఘటనపై అమిత్ షా మాట్లాడుతూ.. ఉగ్రవాదులనే అనుమానంతో కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామి ఇచ్చారు. ప్రస్తుతం నాగాలాండ్‌లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.
03:20 PM
► నాగాలాండ్ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో వివరణ ఇచ్చారు.
02:30 PM
► పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా
02:00 PM
► నాగాలాండ్ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్యాహ్నం 3 గంటలకు కీలక ప్రకటన చేయనున్నారు.
01: 16 PM
► సాయుధ దళాల చట్టం దుర్వినియోగమవుతుందని మజ్లీస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 17 మంది అమాయకులను చంపిన జవాన్లను కఠినంగా శిక్షించాలన్నారు. వివాదాస్పద చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
01: 10 PM
► నాగాలాండ్ కాల్పుల ఘటనలో మృతి చెందిన వారికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం నష్టపరిహరం చెల్లించాలని కోరారు. నాగాలాండ్‌లో శాంతిని పునరుద్ధరించాలని కోరారు. ఈ ఘటన వల్ల సైన్యం నైతికత దెబ్బతినకూడదని.. అదేవిధంగా పౌరులకు న్యాయం జరగాలని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.
12: 35 PM
► పార్లమెంట్‌కు నాగాలాండ్ కాల్పుల సేగ తగిలింది. ఈ ఘటనపై వెంటనే ప్రకటన చేయాలంటూ విపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభలో, సాయంత్రం 4 గంటలకు రాజ్యసభలో హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ.. పలువురు కీలక ఎంపీలతో సమావేశమయ్యారు. దీనిలో నాగాలాండ్ ఘటనతో పాటు సభలో అమలు చేయాల్సిన వ్యూహలపై చర్చించినట్లు తెలుస్తోంది.
12: 05 PM
► వాయిదా తర్వాత సభ తిరిగి ప్రారంభమయ్యింది.
11: 25 AM
► విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.
11: 20 AM
► పార్లమెంట్ శీతాకాల సమావేశంలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి లోక్‌సభలో అటెన్షన్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులో.. పోలవరం సవరించిన అంచనా వ్యయం 55,657 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆలస్యం వలన పునరావాసం పనులకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ ఏడాది ఖర్చు చేసిన 1,920 కోట్ల రూపాయలను వెంటనే రియంబర్స్ చేయాలన్నారు. కాగా, వచ్చే ఏడాది కల్లా ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు సహకరించాలన్నారు.
11: 15 AM
► నాగాలాండ్ కాల్పుల ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ క్రమంలో స్పీకర్ ఓంబిర్లా.. దీనిపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని తెలిపారు. అదే విధంగా.. టీఆర్‌ఎస్ ఎంపీలు ధాన్యసేకరణ అంశంపై తీవ్ర ఆందోళన చేపట్టారు. లోక్‌సభలో పోడియం చేరి చుట్టు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం తీసుకురావాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రబీ ధాన్యం సేకరణ సమస్యను పరిష్కరించాలన్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఆరో రోజు సభ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం పార్లమెంట్‌లో నాగాలాండ్ ఘటనపై విపక్షాలు తీవ్ర ఆందోళనలు చేపట్టాయి. కాల్పుల ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. కాల్పుల్లో 17 మంది అమాయక ప్రజలు చనిపోవడాన్ని ప్రతి పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment