చండీగఢ్ : నెల తిరిగేసరికి వచ్చే కొద్దిపాటి మొత్తం కోసం వృద్ధులు మూడునెలలుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పంజాబ్లోని మోగా జిల్లాలో 65 ఏళ్ల మహిళ గుర్తెజ్ కౌర్ 750 రూపాయల పెన్షన్ కోసం ప్రతిరోజూ బ్యాంక్‌కు వెళుతున్నారు. తన కుటుంబానికి తానే పెద్దదిక్కని తమకు ఈ కొద్దిపాటి పెన్షనే ఆధారమని, మే నుంచి పెన్షన్ ఎందుకు జమకావడం లేదో అర్ధం కావడం లేదని వాపోయారు. ఇలాంటి వేలాది మంది లబ్ధిదారులకు కొద్దినెలలుగా పెన్షన్ సొమ్ము నిలిచిపోయింది. అర్హులకు దక్కాల్సిన పెన్షన్ సొమ్ము అడ్డదారిలో అనర్హులకు చేరడం పంజాబ్‌లో కలకలం రేపింది.
70,000 మందికి పైగా నకిలీ పెన్షన్‌దారులు 162.35 కోట్ల రూపాయల పెన్షన్‌ను పొందడంతో అర్హులకు దక్కాల్సిన ఆసరా లభించలేదు. అక్రమ లబ్ధిదారులను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం వారికి విడుదలైన మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసినా రికవరీ పూర్తయి ఆ మొత్తం అర్హుల ఖాతాల్లో చేరేందుకు నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 2015లో వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు మహిళలకు 58 ఏళ్లు, పురుషులకు 65 సంవత్సరాల కనీస వయసును నిర్ధారించడంతో వేల సంఖ్యలో పలువురు నకిలీ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారని అధికారులు గుర్తించారు. ఒంటరి, వికలాంగ పెన్షన్లకూ అనర్హులు నకిలీ పత్రాలతో లబ్ధిదారులుగా మారారని తెలిపారు. సంగ్రూర్, బఠిండా, అమృత్‌సర్, ముక్త్సర్, మన్సా జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అక్రమ లబ్ధిదారులున్నారని అధికారులు వెల్లడించారు. చదవండి : ఓ వీల్‌చెయిర్ విజయం
ఇక అక్రమ లబ్ధిదారుల నుంచి పెన్షన్ సొమ్ము రికవరీకి జారీ చేసిన ఉత్తర్వులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ ఉత్తర్వులతో 70,000కు పైగా కుటుంబాలు పెన్షన్‌ను కోల్పోతాయని అకాలీదళ్ ప్రతినిధి డాక్టర్ దల్జీత్ చీమా అన్నారు. ఈ ఉత్తర్వులు అమానవీయమైనవని అకాలీదళ్ పేర్కొనగా, అనర్హులకు పెన్షన్ మంజూరు చేసిన అధికారులపై చర్యలు చేపట్టాలని ఆప్ డిమాండ్ చేసింది. అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వమే అక్రమ లబ్ధిదారులకు సాయపడిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులను సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందే జాబితాలో చేర్చిందని చెప్పారు. అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వంలో ఎంపికైన అక్రమ లబ్ధిదారులను తొలగించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment