
కన్నూర్: మానవత్వమే మిన్న అని మరోసారి రుజువైంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని కాపాడేందుకు అందరూ ఒక్కటై సాయం అందించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధాన్ని కొనుగోలు చేసేందుకు రూ.18 కోట్లకు పైగా విరాళాల రూపంలో అందించారు. కేరళకు చెందిన పీకే రఫీక్, మరియమ్మ దంపతుల కుమారుడు మొహమ్మద్ (18 నెలలు) స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జెనెటిక్ వ్యాధితో బాధపడుతున్నాడు. రెండో సంవత్సరం వచ్చేలోగా ఆ చిన్నారికి ఈ డోస్ అందించాల్సి ఉంటుందని వైద్యులు వారికి సూచించారు.
ఇందుకు అవసరమైన సాయం సేకరించేందుకు స్థానిక ఎమ్మెల్యే ఎం.విజిన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ వారం క్రితం క్రౌడ్‌ఫండ్ ద్వారా విరాళాలు అందించాలని ప్రజలను కోరింది. ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేపట్టారు. దీంతో వారం రోజుల వ్యవధిలోనే చిన్నారి బ్యాంకు అకౌంట్‌లో రూ.18 కోట్లకు పైగానే డబ్బు జమయ్యాయి. బ్యాంకు అకౌంట్‌కు రూ.18 కోట్లకు పైగానే అందాయని, ఇక విరాళాలు అందివ్వవద్దని మత్తుల్ పంచాయతీ ప్రెసిడెంట్ ఫరిషా సోమవారం ప్రజలను కోరారు. కాగా, మొహమ్మద్ సోదరి అఫ్రా(15)కు కూడా గతంలో ఇదే వ్యాధి సోకడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment