ఇంఫాల్: మణిపూర్‌లో నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయబద్ధమైన, నిష్పక్షపాత ధోరణిలో విచారణ జరిపించాలని అభ్యర్ధించారు.
మణిపూర్ అల్లర్లు మొదలైన మరుసటి రోజున ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వలసపోతున్న ఇద్దరు మహిళలను మొదట వివస్త్రులను చేసి తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన జరిగి రెండు నెలలు దాటినా కూడా వీడియో బయటకు వచ్చేంతవరకు దర్యాప్తు ప్రారంభం కాకపోవడమే అనేక అనుమానాలకు తావిస్తోంది.
సుప్రీంకోర్టు కూడా వీడియో విషయంపై చాలా సీరియస్ అయ్యింది. ఇది పూర్తిగా రాజ్యాంగ వైఫల్యమేనని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మణిపూర్ సంఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మీకు చేతకాకపోతే చెప్పండి మేమే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది కూడా. రాష్ట్రంలో మహిళల భద్రత విషయమై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎప్పటికప్పుడు అక్కడి పురోగతి గురించి తమకు తెలపాలని కూడా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి మణిపూర్ వీడియో కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును కోరగా ఈ రోజు అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు మణిపూర్ పోలీసులు. ఇదిలా ఉండగా నగ్నంగా ఊరేగించబడిన మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: కేరళలో దారుణం.. ఐదేళ్ల బాలిక రేప్, హత్య..
Comments
Please login to add a commentAdd a comment