న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న జనాభాను నియంత్రించడానికి ‘ఇద్దరు పిల్లల’ విధానాన్ని తప్పనిసరి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వ పరిధిలోని అంశమని జస్టిస్ ఎస్.ఎ.కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓకాల ధర్మాసనం వెల్లడించింది. జనాభా పెరుగుదల అనేది ఏదో ఒక మంచి రోజున ఆగిపోయే వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది.
ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేయాలని కోరుతూ అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలో జనాభా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరికొందరు వేసిన పిటిషన్లపై సైతం శుక్రవారం దృష్టి సారించింది. జనాభా నియంత్రణ తమ పని కాదని, దానికంటే చేయాల్సిన ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. జనాభాను అరికట్టడానికి తాము చట్టాన్ని తీసుకురాలేమని ఉద్ఘాటించింది. వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలని పిటిషనర్లకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment