ఢిల్లీ: పార్లమెంటు అలజడి ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రతను తక్కువ అంచనా వేయవద్దని మోదీ అన్నారు.
"పార్లమెంట్‌లో జరిగిన ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అందుకే స్పీకర్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దర్యాప్తు సంస్థలు సమగ్రంగా విచారణ జరుపుతున్నాయి.
"దీని వెనుక ఉన్న అంశాలు, ప్రణాళికలు ఏమిటో అర్థం చేసుకోవడం, పరిష్కారాన్ని కనుగొనడం కూడా అంతే ముఖ్యం. పరిష్కారాల కోసం అన్వేషించాలి. ప్రతి ఒక్కరూ అలాంటి విషయాలపై వివాదాలు లేదా ప్రతిఘటనలకు దూరంగా ఉండాలి" అని ప్రధాని మోదీ కోరారు.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా డిసెంబర్ 13న జీరో అవర్ సమయంలో ఇద్దరు యువకులు సాగర్ శర్మ, మనోరంజన్ పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు. స్మోక్ క్యానిస్టర్లతో పసుపు పొగను విడుదల చేశారు. పార్లమెంట్ భవనంలో నినాదాలు చేశారు. అదే సమయంలో పార్లమెంట్ ఆవరణలో మరో ఇద్దరు అమోల్ షిండే, నీలం దేవి రంగు పొగను విడుదల చేశారు.
ఈ కేసులో మొత్తంగా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఏడు రోజుల కస్టడీలో ఉన్నారు. పోలీసుల వారిని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా నిందితుల ఫోన్లను దహనం చేసిన ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుల వెనక విదేశీ, ఉగ్రవాదులు హస్తం ఉందా?అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
Comments
Please login to add a commentAdd a comment