లక్నో: సరుకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసే విషయంలో, రైల్వేలను ఆధునీకరించే విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మౌలిక వసతుల కల్పనలో రాజకీయాలు వద్దని సూచించారు. ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్(ఈడీఎఫ్‌సీ)లో భాగంగా ‘న్యూ భావ్‌పూర్ – న్యూ ఖుర్జా’ మార్గాన్ని మంగళవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ మార్గంలో తొలి రవాణా రైలు ప్రారంభమైన సందర్భంగా ‘స్వావలంబ భారత్’ గర్జన స్పష్టంగా వినిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తాజా సదుపాయంతో రైతులు సరైన సమయంలో తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేర్చగలరన్నారు.
ఈ ఫ్రీట్ కారిడార్‌కు 2006లోనే అనుమతి లభించిందని, అయితే, అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిరాసక్తత కారణంగా అది పేపర్లపైననే మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని, ఇది తమ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘2014 వరకు ఒక్క కి.మీ. కూడా ట్రాక్ వేయలేదు. నిధులను వినియోగించలేదు. 2014లో మేం ప్రారంభించేనాటికి ప్రాజెక్టు ఖర్చు 11 రెట్లు పెరిగింది. మేం అధికారంలోకి వచ్చిన తరువాత 1,100 కి.మీ.ల పనులు పూర్తయ్యాయి’ అన్నారు. ఈడీఎఫ్‌సీ ప్రాజెక్టులో మొత్తం 1,840 కి.మీ. మేర ప్రత్యేక ఫ్రీట్ కారిడార్‌ను నిర్మిస్తారు. ఇది పంజాబ్‌లోని లూథియానా నుంచి కోల్‌కతా వరకు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment