
కరోనా వైరస్ నుంచి విముక్తికి ప్రతినబూనాలని ప్రధాని పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15న కరోనా వైరస్ నుంచి స్వేచ్ఛ కోసం ప్రజలు ప్రతినబూనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుఇచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం కొత్త విషయాలు నేర్చుకుంటూ మన కర్తవ్యాలకు కట్టుబడాలని అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని, వ్యాధి తీవ్రత ప్రారంభమవడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహమ్మారి పలు ప్రాంతాలకు విస్తరిస్తూ ప్రమాదఘంటికలు మోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆదివారం మన్ కీ బాత్‌లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కోవిడ్-19 రికవరీ రేటు ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మెరుగ్గా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ‘పలు దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉంది.. మనం లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడాం..అయినా కరోనా వైరస్ ముప్పు ఇంకా ముగియలేద’ని వ్యాఖ్యానించారు. పలు ప్రాంతాలకు మహమ్మారి విస్తరిస్తోందని, మనం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని దేశ ప్రజలను ప్రధానమంత్రి అప్రమత్తం చేశారు. రాఖీ పండుగ రానుందని, పలు సంఘాలు..ప్రజలు రక్షాబంధన్‌ను ఈసారి విభిన్నంగా జరుపుకునేందుకు ప్రయత్నించడం హర్షణీయమని అన్నారు. గతంలో క్రీడలు ఇతర రంగాల్లోకి పెద్ద నగరాలు, ప్రముఖ కుటుంబాలు, పేరొందిన పాఠశాలల నుంచే పలువురు దూసుకొచ్చేవారని, ఇప్పుడు గ్రామాలు, చిన్న పట్టణాలు, సాధారణ కుటుంబాల నుంచి ఆయా రంగాల్లోకి పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారని అన్నారు.
కార్గిల్ హీరోలకు నివాళి
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో గెలిచి నేటికి 21 సంవత్సరాలైన సందర్భంగా సైనికుల త్యాగాలను కొనియాడారు. ‘ఈ రోజు చాలా ప్రత్యేకమైంది..కార్గిల్ యుద్ధం ఎలాంటి సమయంలో ఏ పరిస్థితిలో జరిగిందో ఏ ఒక్కరూ మరువలేరు..పాకిస్తాన్‌తో మెరుగైన సంబంధాలను భారత్ కోరుకుంటే అలా జరగలేద’ని కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులను ప్రస్తావించారు. మన సైనికుల ధైర్యానికి ధన్యవాదాలని, కార్గిల్‌లో భారత్ అసమాన పాటవం ప్రదర్శించిందని మోదీ అన్నారు. చదవండి : ఆర్థిక స్వస్థతకు ప్రయత్నం