న్యూఢిల్లీ: డ్రోన్ రంగం భారత్‌లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. పంట భూముల్లో క్రిమిసంహారకాలు, వ్యవసాయ ఉత్పత్తులను చల్లేందుకు వాడే ‘కిసాన్ డ్రోన్’లను ప్రధాని ప్రారంభించారు. దేశంలోని 100 ప్రాంతాల్లో ఒకేసారి వర్చువల్ పద్ధతిలో శుక్రవారం ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.
‘‘రానున్న రోజుల్లో రైతులు తమ పంటను తక్కువ సమయంలోనే డ్రోన్ల సాయంతో మార్కెట్లకు తరలించవచ్చు. పూలు, పండ్లు, కూరగాయలను త్వరగా రవాణా చేయొచ్చు. ఆదాయం పెరుగుతుంది. 21వ శతాబ్దిలో అధునాతన సాగు విధానాల్లో డ్రోన్ అనే కొత్త అధ్యాయం మొదలైంది. డ్రోన్ రంగంలో స్టార్టప్ కంపెనీల సంస్కృతి దేశంలో షురూ అయింది. ప్రస్తుతం 200గా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య త్వరలో వేలు దాటనుంది. ఈ రంగం భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు తేనుంది. ఈ రంగం ఎదుగుదలకు ఎలాంటి విధానపర అడ్డంకులూ లేవు.
డ్రోన్ సెక్టార్ విస్తరించేందుకు తగిన సంస్కరణలను గతంలోనే తెచ్చాం. కొన్నేళ్ల క్రితం రక్షణ రంగానికే పరిమితమైన డ్రోన్లు ఇప్పుడు వేర్వేరు విభాగాలకూ విస్తరించాయి. సరైన సంస్కరణలు తెస్తే వృద్ధి ఎంత బాగుంటుందనేందుకు డ్రోన్ రంగమే ఉదాహరణ. ఈ రంగం విస్తరణకు బీజేపీ సర్కార్ పచ్చజెండా ఊపడమే కాదు, యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తోంది’’ అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment