Prime Minister Narendra Modi Inaugurates Aero India 2023 - Sakshi
Sakshi News home page

Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద 'ఎయిర్ షో'.. ప్రారంభించిన మోదీ..

Published Mon, Feb 13 2023 10:22 AM | Last Updated on Tue, Feb 14 2023 5:12 AM

PM Narendra Modi Inaugurated Aero India 2023 - Sakshi

సాక్షి, బెంగళూరు: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌ అప్రతిహత వేగంతో ముందుకు దూసుకుపోతోందని, ఈ విషయంలో ప్రపంచంలోని అగ్రదేశాల సరసన చేరబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన దేశంలో గత తొమ్మిదేళ్లలో రక్షణ ఉత్పత్తులు భారీగా పెరిగాయని ఉద్ఘాటించారు. సానుకూల ఆర్థిక విధానాలతోనే ఇది సాధ్యమైందని అన్నారు.

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా–2023’ను ప్రధాని మోదీ సోమవారం కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ కాంప్లెక్స్‌లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్షణ పరికరాల కోసం ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన భారత్‌ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. 75 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని వివరించారు. విదేశీ పరికరాలకు మన దేశాన్ని ఒక మార్కెట్‌గా పరిగణించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. శక్తివంతమైన రక్షణ భాగస్వామిగా భారత్‌ తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని పేర్కొన్నారు.  

5 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు  
రక్షణ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, ఎన్నెన్నో ఘనతలు సాధించామని నరేంద్ర మోదీ తెలియజేశారు. మిలటరీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తి విషయంలో మన దేశం పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని చెప్పారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను 1.5 బిలియన్‌ డాలర్ల నుంచి 2024–25 నాటికి 5 బిలియన్‌ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న ‘తేజస్‌ లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’లు రక్షణ ఉత్పత్తుల రంగంలో మన అసలైన ప్రతిభా పాటవాలకు చక్కటి ఉదాహరణలని వెల్లడించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేట్‌ సెక్టార్‌ను ఆహ్వానిస్తున్నామని ప్రధానమంత్రి అన్నా రు.

ఏరో ఇండియా ప్రదర్శనలో వివిధ దేశాల వైమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. లైట్‌ కాంబాట్‌ హెలికాప్టర్‌లో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి ప్రయాణించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐదు రోజులపాటు జరిగే ‘ఏరో ఇండియా’లో దాదాపు 100 దేశాల రక్షణ శాఖ మంత్రులు, ప్రతినిధులు, దేశ విదేశాలకు చెందిన 800కు పైగా డిఫెన్స్‌ కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రక్షణ రంగంలో రూ.75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 250 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. 

 


ప్రత్యేక ఆకర్షణగా అమెరికా ఎఫ్‌–13ఏ ఫైటర్‌ జెట్లు  
ఏరో ఇండియా ప్రదర్శనలో అమెరికాకు చెందిన ఐదో తరం సూపర్‌సానిక్‌ మల్టీరోల్‌ ఎఫ్‌–35ఏ యుద్ధవిమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎఫ్‌–35ఏ లైట్నింగ్‌–2, ఎఫ్‌–13ఏ జాయింట్‌ స్ట్రైక్‌ ఫైటర్‌ అమెరికాలోని ఎయిర్‌బేస్‌ల నుంచి సోమవారం బెంగళూరుకు చేరుకున్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన ఈ అత్యాధునిక ఫైటర్‌ జెట్లు భారత్‌ గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఎఫ్‌–16 ఫైటింగ్‌ ఫాల్కన్, ఎఫ్‌/ఏ–18ఈ, ఎఫ్‌/ఏ–18ఎఫ్‌ యుద్ధ విమానాలు సైతం అమెరికా నుంచి వచ్చాయి.    

ప్రధాని మోదీతో ప్రముఖుల భేటీ  
‘ఏరో ఇండియా’ను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో బెంగళూరులో పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. కన్నడ సినీ నటులు యశ్, రిషబ్‌ శెట్టీ, దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ భార్య అశ్వినీ, మాజీ క్రికెటర్లు అనిల్‌ కుంబ్లే, జవగళ్‌ శ్రీనాథ్, వెంకటేశ్‌ ప్రసాద్, యువ క్రికెటర్లు మయాంక్‌ అగర్వాల్, మనీశ్‌ పాండేతోపాటు పలు రంగాల పెద్దలు మోదీని కలుసుకున్నారు. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో డిన్నర్‌ సందర్భంగా ఈ సమావేశం జరిగింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, గుర్తింపును మరింత ఇనుమడింపజేసేందుకు దక్షిణాది సినీనటులు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలిసింది.   
చదవండి: భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement