PM Modi: ప్రపంచంలోనే పొడవైన టన్నెల్‌ ప్రారంభించిన మోదీ | PM Narendra Modi Inaugurates Sela Tunnel In Arunachal Pradesh | Sakshi
Sakshi News home page

PM Modi: ప్రపంచంలోనే పొడవైన టన్నెల్‌ ప్రారంభించిన మోదీ

Published Sat, Mar 9 2024 11:55 AM | Last Updated on Sat, Mar 9 2024 1:59 PM

PM Narendra Modi Inaugurates Sela Tunnel At Arunachal Pradesh - Sakshi

ఈటానగర్‌: ప్రపంచంలోనే అత్యంత పొడవైన డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్‌ హయాంలో పాలనపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లలో చేయని పనులను తాను పదేళ్లలో చేసిచూపించినట్టు మోదీ కామెంట్స్‌ చేశారు. 

కాగా, టన్నెల్‌ ప్రారంభోత్సవం అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారత ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారంటీ ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఘన విజయం సాధించనుందని అర్థం అవుతోంది. ఎన్నికల్లో విజయం కోసం నేను పనిచేయను. ప్రజల కోసమే పనిచేస్తాను. యూపీఏ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. నార్త్‌ ఈస్ట్‌ రాష్ట్రాల్లో రూ.55వేల పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. 

70 ఏళ్ల యూపీఏ పాలనలో చేయని అభివృద్ధిని నేను పదేళ్లలోనే చేసి చూపించాను. అష్ట లక్ష్మీ పథకం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. పర్యాటక రంగం విషయంలో దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో దృఢమైన సంబంధాలున్నాయి. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాము అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు అనే అంశాన్ని కూడా మోదీ ఇక్కడ గుర్తుచేశారు. 

కాగా, అంతకుముందు ప్రధాని మోదీ.. అసోంలోని కజిరంగా నేషనల్‌ పార్క్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏనుగుపై సఫారీ చేశారు. నేషనల్‌ పార్క్‌లో తిరుగుతూ కాసేపు అక్కడే సమయం గడిపారు. 

ఈ టన్నెల్‌ విశేషాలు ఇవే..

  • సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా-చారిదౌర్‌-తవాంగ్‌(BCT) రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. 
  • సరిహద్దు రహదారుల సంస్థ (BRO).. ఈ రెండు వరుసల టన్నెల్‌ను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి. టన్నెల్‌-1 సింగిల్‌ ట్యూబ్‌తో 1,003 మీటర్ల పొడవుండగా.. టన్నెల్‌-2 రెండు సొరంగమార్గాలతో 1,595 మీటర్ల పొడవు కలిగి ఉంది. రెండింటిని కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్‌-2 సొరంగమార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్‌కు, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు.
  • పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్‌ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది. 
  • దీంతో తవాంగ్‌-దిరాంగ్‌ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. 
  • ఈ టన్నెల్‌ మెరుగైన భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉంది. వెంటిలేషన్‌ వ్యవస్థలు, లైటింగ్‌, అగ్నిమాపక పరికరాలు వంటి అధునాతన సదుపాయాలను సొరంగాల్లో ఏర్పాటు చేశారు. 
  • 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది.
  • అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఈ సొరంగమార్గంతో అత్యవసర పరిస్థితుల్లో భారత దళాలు త్వరితంగా సరిహద్దులకు చేరుకునే అవకాశం కలిగింది.
  • చైనా సరిహద్దులు ఎత్తుగా ఉండటంతో డ్రాగన్‌ బలగాలు సులభంగా భారత దళాల కదలికలను కనిపెట్టగలవు. అయితే సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో వారికి ఆ అవకాశం మూసుకుపోయింది.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement