నా పరువు మంటగలిపేందుకు తెగించారు: ప్రధాని మోదీ | PM Narendra modi serious comments on Rahul Gandhi over personal prestige | Sakshi
Sakshi News home page

నా పరువు మంటగలిపేందుకు తెగించారు: ప్రధాని మోదీ

Published Sun, Apr 2 2023 5:31 AM | Last Updated on Sun, Apr 2 2023 7:14 AM

PM Narendra modi serious comments on Rahul Gandhi over personal prestige - Sakshi

రైలులో విద్యార్థులతో మాట్లాడుతున్న మోదీ

భోపాల్‌: తన వ్యక్తిగత ప్రతిష్టను సర్వనాశనం చేసేందుకు ‘కొందరు’ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీని, రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వేస్టేషన్‌లో భోపాల్‌–ఢిల్లీ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాడే కొందరు నా పరువు ప్రతిష్టలను గంగలో కలపాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు.

‘మోదీ.. నీ సమాధికి గొయ్యి తవ్వుతాం’ అని కూడా కొందరు బహిరంగంగా ప్రతిజ్ఞ చేశారు. తమ లక్ష్యం నెరవేర్చుకునేందుకు దేశ, విదేశీ శక్తులతో చేతులు కలిపారు. కొందరు ఇక్కడి నుంచి పనిచేస్తే, ఇంకొందరు విదేశాల నుంచి కుట్రలు చేస్తున్నారు. ఇందుకు ‘సుపారీ’ సైతం ఇచ్చారు. వారికో విషయం తెలీదనుకుంటా. ఓట్లేసి నన్ను గెలిపించుకున్న కోట్లాది ప్రజానీకం సురక్షా కవచంలా నావైపు నిలిచినంతకాలం నన్నెవరూ ఏమీ చేయలేరు.

ఇలాంటి కుట్రలను పటాపంచలు చేస్తూ దేశాభివృద్ధి కోసం, జాతి నిర్మాణం కోసం ప్రతి ఒక్క పౌరుడు పాటుపడాలి’’ అన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బ్రిటన్‌లో రాహుల్‌ వ్యాఖ్యానించడం, రాహుల్‌ను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించిన ఉదంతాన్ని నిశితంగా గమనిస్తున్నామని జర్మనీ, అమెరికా ఉన్నతాధికారులు ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. భారత అంతర్గత వ్యవహారాల్లోకి రాహుల్‌ కుట్రపూరితంగా విదేశాల జోక్యాన్ని ఆహ్వానిస్తున్నారని బీజేపీ తీవ్రంగా ఆక్షేపించడం తెల్సిందే.

బుజ్జగింపులతో సరిపుచ్చారు
‘గత ప్రభుత్వాలు రైల్వే సేవల విషయంలో ప్రజలను బుజ్జగింపులతోనే సరిపుచ్చాయిగానీ సరైన ప్రయాణ భాగ్యం దక్కనివ్వలేదు. ఆ ఒక్క కుటుంబం గురించే పట్టించుకున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్రయాణ సేవలను గాలికొదిలేశారు. మా సర్కార్‌ సంస్కరణలు తెచ్చి ప్రజానీకం సౌకర్యవంతంగా ప్రయాణించేలా, వారి ఆకాంక్షలకు తగ్గట్లు రైల్వే శాఖను ఆధునీకరిస్తోంది. ప్రజల్ని మోదీ ఒకటోతేదీన ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తాడని కాంగ్రెస్‌ మిత్రులు అంటున్నారు. కానీ మేం అదే ఏప్రిల్‌ ఒకటిన రైలు ప్రారంభించి చూపించాం.

ఈ సెమీ–హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ దేశ నైపుణ్యం, సామర్థ్యం, భరోసాకు ప్రతీక’ అని అన్నారు. ‘ 2014కు ముందు వరకు రైల్వే బడ్జెట్‌లో మధ్యప్రదేశ్‌కు రూ.600 కోట్లు దక్కేవి. మా హయాంలో ఇది ఏకంగా రూ.13,000 కోట్లను దాటింది. కొత్త రైలుతో ఇక్కడి నుంచి ఢిల్లీకెళ్లే వ్యాపారాలు, వృత్తినిపుణులకు ఎంతో ప్రయోజనం. పర్యాటకాభివృద్ధితో ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి’ అని అన్నారు. ఈ మార్గానికి సమీపంలోనే సాచీ, భీమ్‌బెట్కా, భోజ్‌పూర్, ఉదయగిరి గుహలు ఉన్నాయి.

‘ స్వాతంత్య్రంరాగానే సిద్ధంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను మాత్రమే గత ప్రభుత్వాలు అప్‌గ్రేడ్‌ చేశాయి. కొత్త రైల్వేస్‌ను సొంత రాజకీయ ప్రయోజనాలకు పణంగా పెట్టాయి. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ఎందుకు ఈశాన్య రాష్ట్రాలను రైల్వేనెట్‌వర్క్‌లో అనుసంధానం చేయలేదు?. గతంలో ఎందుకు ఆధునీకరించి నవీకరించలేదు ? ’ అని ప్రశ్నించారు.

కార్యక్రమంలో భాగంగా ‘భారతీయ రైల్‌’ ఇతివృత్తంతో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో ఎంపికైన 300 మంది చిన్నారులతో మోదీ మాట్లాడారు. ఆ రైలులో సిబ్బందితోనూ సంభాషించారు. రైలు సర్వీస్‌ ప్రారంభోత్సవంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర గవర్నర్‌ మంగూ భాయ్, సీఎం చౌహాన్‌ పాల్గొన్నారు. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో శనివారం తప్ప మిగతా వారమంతా నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో ఇది 11వది. కొత్త రైలులో అధునాతన బ్రేకింగ్‌ వ్యవస్థ కారణంగా విద్యుత్‌ 30 శాతం ఆదా అవనుంది.

సైనిక సన్నద్ధతపై సమీక్ష
సైనిక దళాల సన్నద్ధత, దేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లు తదితరాలపై ప్రధాని మోదీ కీలక వార్షిక సమీక్ష నిర్వహించారు. భోపాల్‌లో జరిగిన ఈ సమీక్షలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరిహద్దుల వెంబడి చైనాతో సవాళ్లు, పాకిస్తాన్‌ నుంచి సీమాంతర ఉగ్రవాదం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు రక్షణ శాఖ పేర్కొంది. ‘‘కొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచించారు. అందుకవసరమైన సాయుధ, సాంకేతిక సంపత్తిని ఎప్పటికప్పుడు అందజేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు వివరించారు’’ అని వివరించింది. పలు అంశాలను ప్రధానికి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement