న్యూఢిల్లీ: ప్రధాని మోదీ వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళుతున్నారు. క్వాడ్ సదస్సు, ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాల్గొనడానికి మోదీ వెళుతున్నట్టుగా మంగళవారం విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవీ ప్రమాణం చేశాక ప్రధాని మోదీ తొలిసారిగా అమెరికాకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లైన అఫ్గాన్ సంక్షోభం, కోవిడ్ మహమ్మారి, స్వేచ్ఛాయుత ఇండో ఫసిఫిక్ విధానంపై నాలుగు దేశాల కూటమైన (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా) క్వాడ్ సదస్సులో చర్చించనున్నారు.
సెప్టెంబర్ 24న వాషింగ్టన్‌లో జరిగే క్వాడ్ సదస్సులో ప్రధాని పాల్గొంటారు. 23న వైట్‌హౌస్‌లో మోదీ అధ్యక్షుడు బైడెన్‌తో ముఖాముఖి చర్చించే అవకాశాలున్నాయి. బైడెన్‌తో ముఖాముఖి చర్చించడం ఇదే మొదటిసారి కానుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్‌తో విడిగా చర్చలు జరిపే అవకాశాలున్నట్టుగా విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘‘క్వాడ్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిడె సుగ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు పాల్గొంటారు. ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన క్వాడ్ వ్యాక్సిన్‌పై సమీక్షిస్తారు’’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది.
యూఎన్ సర్వప్రతినిధి సదస్సులో...
ఈ నెల 25న న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమతి సర్వప్రతినిధి సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటుగా 100 దేశాలకు చెందిన అధినేతలు హాజరవుతున్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్‌గా ఈ సదస్సుని నిర్వహించారు. ఈ ఏడాది అందరూ కలిసి కూర్చొని చర్చించడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోవిడ్–19 సంక్షోభం నుంచి కోలుకుంటామన్న ఆశతో జాతి పునర్నిర్మాణం, సుస్థిరత కొనసాగడం, భూమి అవసరాలకనుగుణంగా మసలు కోవడం, ప్రజల హక్కుల్ని గౌరవించడం, ఐక్యరాజ్య సమితి పునరుజ్జీవనం తదితర అంశాలపై ఈ సదస్సు జరగనుంది. ఈసారి సదస్సులో అఫ్గానిస్తాన్ ప్రతినిధికి చివరి రోజు ప్రసంగించే అవకాశం కల్పించారు.
వచ్చేవారం అమెరికాకు ప్రధాని
Published Wed, Sep 15 2021 4:30 AM | Last Updated on Thu, Sep 16 2021 10:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment