న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి జాతీయ క్రియేటర్స్ అవార్డులను శుక్రవారం అందజేశారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 20 విభాగాల్లో అవార్డులను అందజేశారు. కాగా సృజనాత్మక వీడియోలు, కథనాలతో సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న కంటెంట్ క్రియేటర్స్‌ను ప్రోత్సహించేందుకు అవార్డులను కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టింది.
వీటిలో స్టోరీ టెల్లింగ్, సెలబ్రిటీ, సామాజిక మార్పు, వ్యవసాయం, సాంస్కృతిక, ట్రావెల్, పర్యావరణ పరిరక్షణ, విద్య, ఆహారం,క్రియేటివిటీ, న్యూ ఇండియా చాంపియన్,టెక్, గేమింగ్, హెరిటేజ్ ఫ్యాషన్ వంటి వివిధ రంగాల్లో ఉత్తమ కంటెంట్ అందించిన క్రియేటర్స్‌ను గుర్తించి వారికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తోంది.
స్టోరీ టెల్లింగ్, సామాజిక మార్పు, పర్యావరణ పరిరక్షణ, విద్య, గేమింగ్‌తో సహా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారిని గుర్తించి, ప్రోత్సహించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ అవార్డుల కోసం 20 విభాగాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1.5 లక్షల నామినేషన్స్ వచ్చాయి. వారికి మద్దతుగా పది లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అందులోంచి 23 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురు అంతర్జాతీయ క్రియేటర్స్ ఉన్నారు. మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ అవార్డును మహిళల విభాగంలో శ్రద్ధ, పురుషుల విభాగంలో ఆర్జే రౌనాక్ అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment