A pond which is made by Ravana urine; All you need to know - Sakshi
Sakshi News home page

అది రావణుని మూత్రంతో నిండిన చెరువు.. ఎక్కడుందంటే..

Published Mon, Jul 10 2023 1:05 PM | Last Updated on Mon, Jul 10 2023 1:28 PM

a pond which is made by ravana urine - Sakshi

మనదేశంలో రామాయణ, మహాభారత కథలతో ముడిపడిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అవి ఎంతో ఆదరణ పొందుతున్నాయి కూడా. వీటిలో విచిత్రమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటే రావణుని మూత్రంతో ఏర్పడిన చెరువు. 

వింత కథనం
ఈ కథ ఎంతో వింతగా అనిపిస్తుంది. అయితే మనదేశంలోని కొన్ని ప్రాంతాలతో ముడిపడిన కథలు స్థానికుల, పురాణాల నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. రావణుని మూత్రంతో నిండిన చెరువు కూడా ఈ కోవలోకే వస్తుంది. జార్ఖండ్‌లోని బైద్యనాథ్‌లో అత్యంత ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని రావణుడు ఇక్కడికి తీసుకువచ్చాడని చెబుతారు.

కనీసం నీటిని తాకరు
ఈ ఆలయానికి సమీపంలో రెండు చెరువులు ఉన్నాయి. వాటిలో ఒక చెరువు రావణుని మూత్రంతో ఏర్పడిందని చెబుతారు. ఈ కారణంగానే ఇక్కడికి వచ్చేవారు కనీసం ఈ నీటిని తాకరు. అలాగే ఈ నీటిని ఏ పనులకు కూడా వినియోగించరు. 

రావణుని మొండితనాన్ని గ్రహించి..
ఆలయ స్థల పురాణం ప్రకారం ఒకసారి రావణుడు మహాశివునికి ప్రతిరూపమైన శివలింగాన్ని లంకకు బలవంతంగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. రావణుని మొండితనాన్ని గ్రహించిన మహాశివుడు ఆ శివలింగాన్ని దారిలో ఎ‍క్కడ కింద పెట్టినా, అది మరిక కదలదని చెబుతాడు. ఈ షరతు విన్న రావణుడు దానికి సరేనంటాడు. అయితే ఈ సంగతి తెలుసుకున్న విష్ణుమూర్తి ఇది జరగకుండా చూడాలని తిరిగి శివుడిని కోరుతాడు. 

లఘుశంక తీర్చుకునేందుకు..
శివలింగం తీసుకువెళుతున్న రావణుడు దారిలో లఘుశంక కోసం ఆగాల్సి వస్తుంది. ఈ సమయంలో మహావిష్ణువు బాలుని రూపంలో రావణునికి ఎదురవుతాడు. రావణుడు కాసేపు ఈ శివలింగాన్ని పట్టుకోవాలని ఆ పిల్లవాడిని కోరతాడు. రావణుడు లఘుశంక తీర్చుకుని తిరిగి వచ్చేసరికి ఆ బాలుడు కనిపించడు. అయితే ఆ శివలింగం అక్కడ నేలపై ఉంటుంది. రావణుడు ఆ శివలింగాన్ని పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదట.

బైద్యనాథ్‌లో కొలువై..
ఆ శివలింగమే బైద్యనాథ్‌లో కొలువై పూజలు అందుకుంటోందని చెబుతారు. రావణుడు మూత్రం పోసిన ప్రాంతం చెరువుగా మారిందని, అందుకే దానిని రావణుని మూత్రం చెరువుగా అభివర్ణిస్తారు. అలాగే దీనిలోని నీటిని ఎవరూ వినియోగించరు. కాగా ఇది నమ్మకాలపైన ఆధారపడిన అంశమని, దీనిలో వాస్తవం లేదనేవారు కూడా ఉన్నారు. 
ఇది కూడా చదవండి: ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందు​కు పంపిస్తున్నారంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement