
సాక్షి, ఢిల్లీ: దేశంలో పేదలు కలలు కనొచ్చు.. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చని.. అందుకే తానే ఒక మంచి ఉదాహరణ అని భారత దేశ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సోమవారం(ఇవాళ) ఉదయం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో రాష్ట్రపతిగా ఆమె ప్రమాణం చేశారు. అనంతరం ఆమె ప్రసంగించారు.
అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు అని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మీ ప్రేమ, ఆప్యాయత, నమ్మకం.. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడానికి నన్ను ప్రోత్సహిస్తాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో.. రాష్ట్రపతిగా నేను బాధ్యతలు చేపట్టడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. స్వాతంత్ర్య సమరయోధుల లక్ష్యాల కోసం మనం కృషి చేయాలి. దేశ రక్షణ దళాలకు, పౌరులందరికీ కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు.
నేను ఒక ఆదివాసీ గ్రామం నుంచి వచ్చా. మా గ్రామంలో బాలికలు స్కూల్‌కు వెళ్లడం ఎంతో పెద్ద విషయం.. మా ఊరిలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేనే. ఆదివాసీ మహిళగా దేశ అత్యున్నత పదవి చేపట్టం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. దేశంలో పేదలు కలలు కనొచ్చు. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చు. అందుకే నేనే ఒక ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, సంప్రదాయాలు నాకు అత్యంత ప్రాధాన్యత అంశాలు. దేశంలోని మహిళలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నా అని పార్లమెంట్ సెంట్రల్ హాల్ సాక్షిగా ఆమె ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment