ప్రమాదంలో యావత్‌ దేశం.. కేంద్రం ఆందోళన | The Present Covid Situation Is Scary: NITI Aayog Member | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో యావత్‌ దేశం.. కేంద్రం ఆందోళన

Published Wed, Mar 31 2021 4:26 AM | Last Updated on Wed, Mar 31 2021 11:23 AM

The Present Covid Situation Is Scary: NITI Aayog Member - Sakshi

ఢిల్లీలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండోడోస్‌ తీసుకుంటున్న కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత మరింత విషమంగా మారిందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనకరంగా తయారైందని తెలిపింది. ప్రస్తుతం దేశం మొత్తం ప్రమాదంలో పడిందనీ, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన మొదటి 10 జిల్లాల్లో 8 మహారాష్ట్రలో, ఒకటి ఢిల్లీలో ఉన్నట్లు వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్, నీతి ఆయోగ్‌(ఆరోగ్య)సభ్యుడు వీకే పాల్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో యాక్టివ్‌ కేసులు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించిన 10 జిల్లాల్లో పుణేలో 59,475 కేసులు, ముంబైలో 46,248, నాగ్‌పూర్‌లో 45,322, థానేలో 35,264, నాశిక్‌లో 26,553, ఔరంగాబాద్‌లో 21,282, బెంగళూరు అర్బన్‌లో 16,259, నాందేడ్‌లో 15,171, ఢిల్లీలో 8,032, అహ్మద్‌నగర్‌లో 7,952 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలిపారు.

‘దేశంలో ప్రస్తుతం పరిస్థితులు విషమంగా మారాయి. గడిచిన కొన్ని వారాల్లోనే కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. ఏ ఒక్క రాష్ట్రం, ప్రాంతం, జిల్లా ఇందుకు మినహాయింపు కాదు’అని వారన్నారు. ‘ఆస్పత్రుల్లో ఐసీయూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసులు వేగంగా పెరిగిన పక్షంలో ఆరోగ్య వ్యవస్థ స్తంభించిపోతుంది’అని చెప్పారు. జాతీయ స్థాయిలో పాజిటివిటీ రేట్‌ 5.65% ఉండగా మహారాష్ట్రలో గత వారం ఇది 23%గా రికార్డయినట్లు తెలిపారు. ఆ తర్వాత పంజాబ్‌లో పాజిటివిటీ రేట్‌ 8.82%, ఛత్తీస్‌గఢ్‌లో 8.24%, మధ్యప్రదేశ్‌లో 7.82%, ఢిల్లీలో 2.04% ఉందన్నారు. దేశంలో యూకే వేరియంట్‌ కేసులు 807, దక్షిణాఫ్రికా వేరియంట్‌ కేసులు 47, బ్రెజిల్‌ వేరియంట్‌ కేసు ఒకటి బయటపడింది. 

జిల్లాల వారీగా చర్యలు
మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, తదితర రాష్ట్రాల్లోని కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న 47 జిల్లాల అధికారులకు శనివారం రాసిన లేఖలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చామని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. ఒక్కో పాజిటివ్‌ కేసుకు 25 నుంచి 30 కాంట్రాక్టులను గుర్తించి, ఐసోలేషన్‌లో ఉంచాలని కోరామన్నారు. కంటైన్మెంట్‌ జోన్ల పరిధిని కూడా విస్తరించాలని తెలిపినట్లు వివరించారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి 6.11 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అత్యధికంగా 48.39% మందికి, ఆ తర్వాత ఢిల్లీలో 43.11% మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకా పంపిణీ జరుగుతుందన్నారు. కో–విన్, ఆరోగ్య సేతు యాప్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చని, లేదంటే ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వ్యాక్సిన్‌ కేంద్రంలోనే పేర్ల రిజిస్ట్రేషన్‌ ఉంటుందని చెప్పారు.

రికార్డు స్థాయిలో 56,211 కేసులు
దేశంలో 24 గంటల్లో మరో 56,211 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసులు 1,20,95,855ఎగబాకాయి. ఒక్క రోజులోనే ఈ మహమ్మారితో 271 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,62,114కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మృతుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 102 మంది ఉన్నారని పేర్కొంది. యాక్టివ్‌ కేసులు 5,40,720 కాగా మొత్తం కేసుల్లో ఇవి 4.47%కు చేరుకున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,1393,021కు చేరుకోగా రికవరీ రేట్‌ మాత్రం 94.19%కి తగ్గిపోయింది. 

ఒకే పడకపై ఇద్దరు కోవిడ్‌ రోగులు
నాగ్‌పూర్‌: ఆస్పత్రిలో ఒకే పడకపై ఇద్దరు కోవిడ్‌ రోగులను ఉంచిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. నగరంలోని నాగ్‌పూర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో తీసిన ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం కోవిడ్‌ ఉన్న పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ప్రైవేటు ఆస్పత్రులు వైద్యం కోసం భారీగా డబ్బును వసూలు చేస్తాయని భయపడుతున్న వారంతా ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. అంతేగాక బాగా సీరియస్‌ పరిస్థితిలో ఉన్న రోగులను డాక్టర్లు వార్డుకు పంపిస్తుండడంతో ఈ పరిస్థితి ఎదురైందని ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ అవినాశ్‌ గవాండే చెప్పారు. అయితే ఫొటోలు తీసిన నాటికి, ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. వర్క్‌లోడ్‌ ఒకప్పుడు ఎక్కువగా ఉండేదని ఇప్పుడు తక్కువే ఉందన్నారు. ప్రస్తుతం బెడ్‌కు ఒక రోగి మాత్రమే ఉన్నారని చెప్పారు. 

చదవండి: (మాస్క్‌ సరిగా ధరించకుంటే ఫైన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement