ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణల కేసులో నిరసనలు కొనసాగిస్తున్న తమపై తీవ్రమైన ఒత్తిడి ఉందని రెజ్లర్ సాక్షి మాలిక్ చెప్పారు. రాజీకి రావాలని నిందితుని మనుషులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదును వెనుకకు తీసుకోవాలని ఒత్తిడి చేసినందునే మైనర్ రెజ్లర్ తండ్రి మాట మార్చారని అన్నారు. 'నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేయించాలని మొదటి నుంచి మేం కోరుతున్నాం.. బయట ఉండడం వల్ల కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు' అని ఆమె ఆరోపించారు.
బ్రిజ్ భూషణ్‌పై చేసింది తప్పుడు ఫిర్యాదని బాధిత మైనర్ రెజ్లర్ తండ్రి మీడియాకు తెలిపడంతో అంతా అవాక్కయ్యారు. 2022లో అండర్-17 ఛాంపియన్‌షిప్ ట్రయల్స్ ఫైనల్స్‌లో తన కూతురు ఓడిపోయిందని తెలిపారు. ఆ పోటీలో తన కూతురు ఓటమికి కారణమైన రెఫరీని డబ్ల్యూఎఫ్ డిప్యూటేషన్ మీద పంపించిందని, దాని అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కాబట్టే ఆయనపై కోపంతో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను ఎలాగైనా ఆ సీటు నుంచి దించే ఉద్దేశంతో నిరసనలు కొనసాగిస్తున్న రెజ్లర్లు.. కేంద్రం నుంచి లభించిన హామీతో ఓ మెట్టు దిగారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో సమావేశమైన అనంతరం జూన్ 15వ తేదీ దాకా ఆందోళనలను చేపట్టబోమని ప్రకటించారు. అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం..
అలా అయితే.. ఆసియా గేమ్స్ ఆడబోము..
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణల కేసులో తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ ఏడాది వచ్చే ఆసియా గేమ్స్ ఆడబోమని రెజ్లర్లు అల్టిమేటం జారీ చేశారు.ప్రతిరోజూ మానసికంగా తాము వేదనను అనుభవిస్తున్నామని తెలిపారు. హరియాణాలోని సోనిపట్‌లో ఈ రోజు నిర్వహించిన కాప్ పంచాయత్‌లో టాప్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో రెజ్లర్లు సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఐదు డిమాండ్లను వారు కోరారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలను స్వతంత్రగా నిర్వహించాలని, బ్రిజ్ కుటుంబ సభ్యులెవరూ అందులో పాల్గొనకుండా చూడాలని కేంద్రాన్ని రెజ్లర్లు కోరినట్లు తెలుస్తోంది. వీటితో పాటు తమపై పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను వాళ్లు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మహిళా రెజ్లర్ల భద్రతను ప్రధానాంశంగా పరిగణిస్తామని, అలాగే.. వాళ్లపై ఎఫ్‌ఐఆర్‌లను వెనక్కి తీసుకుంటామని మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం చర్చల సారాంశాన్ని మీడియాకు తెలిపారు. అయితే.. బ్రిజ్ అరెస్ట్‌పై మాత్రం ఇరువర్గాలు స్పందించకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి:రెజ్లర్ల పోరాటానికి ఊహించని షాక్.. అసలు నిజం ఇదేనా?
Comments
Please login to add a commentAdd a comment