మంగళవారం రాత్రి అబూదాబిలో అహ్లాన్ మోదీ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రధాని
అబుదాబి: యూఏఈ, భారత్ మైత్రి ప్రపంచానికే ఆదర్శనీయమని ప్రధాని నరేంద్ర మోదీ శ్లాఘించారు. మంగళవారం అబూదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘అహ్లాన్ (హలో) మోదీ’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దాదాపు 50,000 మంది పాల్గొన్న కార్యక్రమం ‘హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ’, ‘వుయ్ లవ్ మోదీ’, ‘ భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తిపోయింది. స్టేడియం బయట మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ సాదర స్వాగతం పలికారు. ప్రేక్షకులనుద్దేశించి మోదీ ఏమన్నారంటే...
‘‘యూఏఈ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వచ్చి మీరంతా చరిత్ర సృష్టించారు. భారత్‌లోని విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన వారూ ఉన్నారు. అందరి హృదయాలను యూఏఈ కలిపింది. ఇక్కడి ప్రతి ఒక్కరి శ్వాస, గుండె చప్పుడు, స్వరం, ప్రతి గళం ‘భారత్, యూఏఈ దోస్తీ జిందాబాద్’ అని నినదిస్తోంది. ఇరు దేశాల మైత్రి ప్రపంచానికే ఒక మోడల్‌గా మారింది. 21వ శతాబ్ది మూడో దశకంలో కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. రెండు దేశాల భాగస్వామ్యం అన్ని రంగాల్లోనూ సమున్నత శిఖరాలకు చేరుతోంది. రోజు రోజుకూ ఈ బంధం మరింత బలపడాలని భారత్ మనసారా కోరుకుంటోంది. ప్రతిభ, సృజన, సంస్కృతిలో మన అనుబంధం దాగి ఉంది’’ అని మోదీ అన్నారు. భారతీయ భాషల్లో అంతర్భాగంగా కలిసిపోయిన అరబిక్ పదాలను ప్రస్తావించారు. ఆ పదాలను మోదీ ఉచ్ఛరించినప్పుడల్లా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.
మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది
‘140 మంది భారతీయుల సందేశాన్నిమోసుకొచ్చా. అదేంటంటే.. మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది. ఈ పదేళ్లలో ఏడు సార్లు ఇక్కడికొచ్చా. ఈరోజు కార్యక్రమం నా స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జయేద్’ నాకు రావడం నిజంగా నా అదృష్టం. ఇది నాకు మాత్రమే కాదు 140 కోట్ల భారతీయులకు గర్వకారణం. సుఖమయ జీవనం, సులభతర వాణిజ్యానికి ఇరు దేశాలు కృషిచేస్తున్నాయి. 2047 కల్లా ‘అభివృద్ధి చెందిన భారత్’ ప్రతి ఒక్క భారతీయుడి లక్ష్యం. మోదీ గ్యారెంటీ అంటే ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే.
ప్రధానిగా మూడోదఫా పాలనలో భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారుస్తానని గ్యారెంటీ ఇస్తున్నా’’ అని మోదీ వ్యాఖ్యానించారు. తర్వాత స్టేడియంలో ఓపెన్‌టాప్ బ్యాటరీ వాహనంలో స్టేడియంలో అంతా కలియతిరిగారు. ప్రేక్షకులకు అభివాదం చేశారు. జాతీయ జెండాలతో, సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో విచ్చేసిన జనంతో స్టేడియం భారతీయతను సంతరించుకుంది. మోదీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కొన్ని వాక్యాలు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment