
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం జరిగిన 'దీక్షాంత్ పరేడ్ ఈవెంట్' లో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రొబిషినరీ పిరియడ్‌లో ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు వారి ఉద్యోగాన్ని, వారి యూనిఫామ్‌ను గౌరవించాలని మోదీ కోరారు. ‘మీ ఖాకీ యూనిఫాం పట్ల గౌరవాన్ని కోల్పోకండి. కరోనా కారణంగా పోలీసులు చేస్తున్న మంచి పనులు వారు ఎప్పుడూ ప్రజల మనస్సులలో చిరస్మరణీయంగా మిగిలేలా చేశాయి’ అని కొనియాడారు.
అకాడమీ నుంచి బయటకు వచ్చిన యువ ఐపీఎస్ అధికారులతో తాను తరచూ సంభాషిస్తానని, అయితే ఈ సంవత్సరం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వారిని కలవలేకపోయానని ప్రధాని చెప్పారు. కానీ తన పదవీకాలంలో, ఖచ్చితంగా అందరినీ ఏదో ఒక సమయంలో కలుస్తానని తనకి ఖచ్చితంగా తెలుసు అని ఆయన తెలిపారు. ఐపీఎస్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీ వృత్తిలో ఊహించని అనేక ఘటనలు జరుగుతాయి. చాలా హింసను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటప్పుడు మీకు ఇష్టమైనవారితో, మంచి సలహాలు ఇచ్చే వారితో మాట్లాడండి. ఒత్తిడిలో పనిచేసేవారందరికి యోగా, ప్రాణాయామం మంచిది. ఇలా చేస్తే ఎంత పని ఉన్నా మీరు ఒత్తిడికి గురికారు’ అని తెలిపారు. నేషనల్ పోలీస్ అకాడమీలో 131మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. వీరిలో 28 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. 42 వారాల పాటు శిక్షణ పూర్తిచేసుకున్న వీరిని పలు కేడర్లకు నియమించారు. తెలంగాణకు 11మంది, ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు ఐపీఎస్‌లను కేటాయించారు. చదవండి: పెట్టుబడులకు భారత్ అత్యుత్తమం: మోదీ
Comments
Please login to add a commentAdd a comment