
ఢిల్లీ: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా కేద్కర్ అధికార దుర్వినియోగం, యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్లు సమర్పించటం వంటి ఆరోపణలపై దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. తాజాగా ఆ కమిటీ దర్యాప్తు నివేదికను డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ)కు అందజేసింది. డీఓపీటీ అడిషనల్ సెక్రటరీ మనోజ్ ద్వివేది ఈ కేసులోని అన్ని కోణాల్లో విచారణ జరిపారు. అయితే ఈ రిపోర్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.
చదవండి: యూపీఎస్సీపై మరక తొలగేదెలా?
ట్రైనీ అయినాసరే జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకూ అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్‌చేయడంతో పూజ వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీస్‌ను కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్‌చేయడంతోపాటు సొంత ఖరీదైన కారుపై ఎర్ర బుగ్గను తగిలించుకుని తిరిగారు. దీంతో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిమ్ జిల్లాలో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.
మరోవైపు.. ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్‌లో ఆలిండియా 821వ ర్యాంక్ సాధించారని మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో యూపీఎస్సీకి ఆమె సమర్పించిన వైకల్యం సర్టీఫికెట్లు, అఫిడవిట్ల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ విషయంలో నిజానిజాలను నిగ్గుతేల్చాలని కేంద్రప్రభుత్వ ఏకసభ్య కమిటీని నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment