ఛండీగఢ్: పరారీలో ఉన్న ఖలీస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్.. పంజాబ్ పోలీసులకు లొంగిపోతాడనే ప్రచారం జోరందుకుంది. అకల్ తఖ్త్ సదస్సు నేపథ్యంలో లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమృతపాల్ సింగ్ వైశాఖి సందర్భంగా సిక్కుల సర్బత్ ఖల్సా సమావేశానికి పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో.. పంజాబ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు.
పంజాబ్‌లోని చారిత్రక నేపథ్యం ఉన్న ఏదైనా గురుద్వారాకు వచ్చి అమృత్‌పాల్ పోలీసులకు లొంగిపోవచ్చనే ప్రచారం నడుస్తోంది. అలా కానిపక్షంలో పోలీసులే అతన్ని అరెస్ట్ చేయొచ్చు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీ వరకు పంజాబ్ పోలీస్ శాఖలో సెలవుల్ని రద్దు చేశారు.
పాక్ ప్రేరేపిత ఖలీస్తానీ గ్రూప్ తరపు నుంచి పంజాబ్‌లో విధ్వంసానికి అమృత్‌పాల్ సింగ్ ప్రణాళిక వేశాడని.. ఈ క్రమంలోనే తన అనుచరుడిని విడిపించుకునేందుకు అనుచర గణంతో అమృత్‌సర్‌కు దగ్గర్లో ఉన్న ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి కూడా చేశాడనే అభియోగాలు అమృత్‌పాల్‌సింగ్‌పై నమోదు అయ్యాయి. మరోవైపు అతని అనుచరులను సైతం అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు.. జాతీయ భద్రతా చట్టం ప్రయోగించడం గమనార్హం.
అమృత్‌పాల్ ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపుపై రాజకీయ విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. అమృత్‌పాల్ పేరిట సిక్కు హక్కుల సాధకులపై అణచివేత జరుగుతోందని, అమాయకపు యువతను అరెస్ట్ చేస్తున్నారంటూ పలు పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment