పంజాబ్‌లో ఉనికిలో లేని శాఖకు మంత్రి  | Punjab Minister held fake portfolio for 20 months | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో ఉనికిలో లేని శాఖకు మంత్రి 

Published Sun, Feb 23 2025 5:56 AM | Last Updated on Sun, Feb 23 2025 5:56 AM

Punjab Minister held fake portfolio for 20 months

21 నెలలపాటు మంత్రిగా పనిచేసిన కుల్దీప్‌సింగ్‌ ధలీవాల్‌  

పొరపాటును గుర్తించిన ప్రభుత్వం  

చండీగఢ్‌:  ప్రభుత్వంలో శాఖలకు మంత్రులుంటారు. అసలు ఉనికిలోనే లేని శాఖకు మంత్రులుంటారా? ఆమ్‌ ఆద్మీ పార్టి(ఆప్‌) ఏలుబడిలో ఉన్న పంజాబ్‌లో ఈ విచిత్రం చోటుచేసుకుంది. కుల్దీప్‌సింగ్‌ ధలీవాల్‌ పంజాబ్‌ పరిపాలన సంస్కరణల శాఖతోపాటు ప్రవాస భారతీయుల(ఎన్‌ఆర్‌ఐ) వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా 21 నెలలు పనిచేశారు. నిజానికి పరిపాలన సంస్కరణల శాఖ అనేది లేనే లేదు. కానీ, ఆయన ఆ శాఖ మంత్రిగా చెలామణి అయ్యారు. కేబినెట్‌ పునర్వ్యస్థీకరణ సందర్భంగా ధలీవాల్‌కు 2023 మే నెలలో ఈ శాఖ అప్పగించారు. 

అయితే, పరిపాలన సంస్కరణల శాఖ మంత్రిగా ఆయనకు సిబ్బందిని కేటాయించలేదు. ఈ శాఖపై కనీసం ఒక్కసారి కూడా సమావేశం జరగలేదు. 21 నెలల తర్వాత పంజాబ్‌ సర్కారు అసలు విషయం గుర్తించింది. పరిపాలన సంస్కరణల శాఖ అనేది ఉనికిలో లేదని చెబుతూ ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం కుల్దీప్‌సింగ్‌ ధలీవాల్‌ వద్ద ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ ఒక్కటే మిగిలి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భగవంత్‌ మాన్‌ ప్రభుత్వ పాలన ఎలా ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నాయి. భగవంత్‌ మాన్‌కు పరిపాలన రాదని బీజేపీ సీనియర్‌ నేత సుభాష్‌ శర్మ, శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ విమర్శించారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement