లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటనపై ఆందోళనలు మిన్నంటాయి. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం మధ్యాహ్నం పాదయాత్రగా వెళుతున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రనేతల అరెస్ట్‌తో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార‍్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
పోలీసులు తోసివేశారు : రాహుల్
హథ్రాస్‌కు పాదయాత్రగా వెళుతున్న తమ పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. యమున ఎక్స్‌ప్రెస్ వేపై తమను పోలీసులు అడ్డగించి తనను తోసివేస్తే కిందపడ్డానని రాహుల్ పేర్కొన్నారు. కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కరే రోడ్డుపై నడవాలా అని రాహుల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కరోనా వైరస్ మార్గదర్శకాల ప్రకారం హత్రాస్‌కు వెళ్లకుండా నేతలను నిలువరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అంతకుముందు రాహుల్, ప్రియాంక రాక సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హథ్రాస్‌కు చేరుకున్నారు.
బాధిత కుటుంబ సభ్యులను కలిసేందుకు వారికి పోలీసు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పర్యటనకు వీలేదని రాహుల్, ప్రియాంకను రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత హైటెన్షన్ నెలకొంది. తాజా పరిణామాలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ కరువైందని, యోగీని వెంటనే సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని రాష్ట్రపతి పాలన విధించాలని మాయావతి కోరారు. కాగా యూపీలోని హథ్రాస్‌లో పొలం పనులకు వెళ్లిన దళిత యువతిపై దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ ఢిల్లీ ఆస్పత్రిలో మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. హథ్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. చదవండి : బాధితురాలికి చిత్రహింసలు
Comments
Please login to add a commentAdd a comment