లక్నో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పిటిషనర్ తరపు న్యాయవాది ఎంత సేపటికి వాదనలు ముగించకపోవడంతో ధర్మాసనం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగాఎన్నికైన రాహుల్ గాంధీ భారతీయ పౌరుడు కాదని, ఆయన బ్రిటిష్ పౌరుడని పేర్కొంటూ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు కర్ణాటక బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ తన న్యాయవాది అశోక్ పాండే ద్వారా ఈ పిల్ దాఖలు చేశారు.
దీనిపై స్టిస్ రాజన్ రాయ్ మరియు జస్టిస్ ఓం ప్రకాష్ శుక్లాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా దాదాపు 90 నిమిషాల పాటుఅశోక్ పాండే వాదనలు వినిపించారు. అయితే ఆయన వాదనలు విన్న తర్వాత ఈ కేసులో ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
అయినప్పటికీ న్యాయవాది పాండే తనకు వాదించేందుకు మరింత సమయం కావాలని పట్టుబట్టారు. దీనిపై ధర్మాసనం స్పందింస్తూ.. తనకు, తన పిటిషనర్‌కు వాదనలు వినిపించేందుకు సరైనసమయం ఇచ్చిందని, తమ వాదనలన్నీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పడంతో న్యాయవాది పాండే అసహనానికి గురయ్యారు.
తనకు వాదించడానికి మరింత సమయం కావాలని పట్టుబట్టారు. 20 రోజులపాటు వాదనలు జరుగుతాయని, కానీ ధర్మాసనం గంట కూడా తన మాటలు వినడం లేదని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, వాదనలు తగినంతగా ఉంటే ఆ విషయాలపై విచారణలు 20 రోజుల పాటు కొనసాగించవచ్చని పేర్కొంది. న్యాయవాది పాండే చేస్తున్న వాదనలను ఇప్పటికే కోర్టు విని పరిశీలించిందని ధర్మాసనం మరోసారి నొక్కి చెప్పింది.
అయినప్పటికీ పాండే వినకుండా.. బెంచ్ వ్యక్తిగతంగా వ్యవహరించకూడాదని అన్నారు. దీంతో ధర్మసానం ఆగ్రహంవ్యక్తం చేసింది. మీరు మా సహనాన్ని పరిక్షిస్తున్నారు. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారు. మీకు వాదించడానికి తగినంత సమయం ఇచ్చాము. మీ ప్రవర్తన చూస్తుంటే ఇతర కేసులను వినకుండా చేయాలని చూస్తున్నట్లు ఉంది అని పేర్కొంది. చివరికి న్యాయమూర్తులు న్యాయస్థానం నుంచి బయలుదేరుతుండగా.. హైకోర్టు తుది కోర్టు కాదని వ్యాఖ్యానించారు.
తన వాదనలు అనంతరం కొత్త పిటిషన్ దాఖలు చేసేందుకు తాజా పిల్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని బెంచ్‌ను అభ్యర్థించారు పాండే. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఒకవేళ పిల్‌ను పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే, కోర్టు సమయాన్ని 90 నిమిషాల వృధా చేసినందుకు బెంచ్ అతనిపై పెనల్టీ విధిస్తుందని మందలించింది.
Comments
Please login to add a commentAdd a comment