‘పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తరచూ ఎదురవుతుంటుంది. దీనికి అతని నోటి నుంచి సమాధానం తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల రాయ్‌బరేలీలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాహుల్ గాంధీ ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయన మరోమారు ఈ ప్రశ్నను ఎదుర్కోవలసి వచ్చింది. దానికి రాహుల్ గాంధీ నవ్వుతూ బదులిచ్చారు.
రాయ్‌బరేలీ ఎన్నికల ర్యాలీలో ఒక వ్యక్తి రాహుల్‌ను మీ పెళ్లెప్పుడు? అని అడిగాడు. దానికి రాహుల్ నవ్వుతూ ‘త్వరలోనే చేసుకోవాలి’ అని సమాధానమిచ్చారు. గతంలో రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నప్పుడు ఓ ఆరేళ్ల చిన్నారి.. రాహుల్‌తో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించింది. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘ప్రస్తుతం నేను పనుల్లో బిజీగా ఉన్నాను’ అని సమాధానమిచ్చారు. వెంటనే ఆ చిన్నారి ‘ఆ పనులు ఎప్పుడు పూర్తవుతాయని’ అడిగింది. ఈ ప్రశ్న వినగానే రాహుల్ ఆశ్చర్యపోయారు. అప్పట్లో రాహుల్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఒకసారి పట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్.. రాహుల్ గాంధీతో ‘మా మాట విని పెళ్లి చేసుకోండి. సమయం ఏమీ మించిపోలేదు. మీరు పెళ్లి చేసుకుంటే మేము ఊరేగింపులో పాల్గొంటాం. పెళ్లి విషయంలో మీరు మీ అమ్మగారి మాట కూడా వినడం లేదని ఆమె మాతో చెప్ప బాధ పడ్డారు. మీరు పెళ్లి చేసుకోవాల్సిందే’ అని అన్నారు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘మీరు అన్నారంటే.. అయిపోతుంది’ అని అన్నారు.
గతంలో రాహుల్ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌కు వెళ్లిన సందర్భంలో ఆయన అక్కడ మోటార్ సైకిళ్లను రిపేర్ చేస్తున్న ఒక మెకానిక్‌తో మాట్లాడారు. అప్పుడు ఆ మెకానిక్ రాహుల్‌తో ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడిగాడు. దానికి రాహుల్ ‘నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడే చేసుకుంటాను’ అని సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment