న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు!. ఆయనతో పాటు పలువురు సీనియర్లు సైతం సమావేశాలకు గైర్హాజరు కాబోతున్నారని సమాచారం.
రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యాత్రంలో పలువురు నేతలు కూడా రాహుల్ వెంట ఉన్నారు. ఈ క్రమంలో.. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండానే యాత్రను కొనసాగించాలని రాహుల్, ఆ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ బుధవారం(డిసెంబర్ 7వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ఎవరు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రం ప్రతిపక్ష నేత ఎంపిక విషయంపై నిర్ణయం తీసుకునేందుకు పార్టీ కీలక భేటీ నిర్వహించనుంది. ఎంపిక చేయబడిన ఏఐసీసీ కీలక సభ్యులు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఇది వరకు సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఉండేవారు. అయితే.. ఆయన అధ్యక్ష పదవి చేపట్టడంతో ఇప్పటికీ ఆయన స్థానంలో మరొకరి నియామకం జరగలేదు. దీంతో ఆయన్నే కొనసాగించాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ‘ఒక వ్యక్తి.. ఒకే పదవి’ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కవితకు నోటీసులిస్తే రాష్ట్రం ఉద్యమించాలా?
Comments
Please login to add a commentAdd a comment