సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పేదరికం, నిరుద్యోగం, పెరిగిపోయాయని, యువతరానికి ఉపాధి కల్పనలో ప్రభుత్వానికి నిజాయితీ లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. పోటీ పరీక్షల దరఖాస్తు ఫారాలను అమ్మి, కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారనీ, అయితే పరీక్షలు మాత్రం నిర్వహించడం లేదని, కొన్ని పరీక్షలు నిర్వహించినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఫలితాలను ప్రకటించడం లేదని రాహుల్ ఆరోపించారు. నిరుద్యోగం, ప్రైవేటీకరణ పెరగడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.2017 నుంచి ఇప్పటి వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎటువంటి నియామకాలు చేపట్టలేదని ఆమె ఆరోపించారు.
ప్రభుత్వం తక్షణం ఉపాధి కల్పన, తొలగించిన వారిని తిరిగి పనిలోకి తీసుకోవడం, ఉద్యోగాల కోసం పెండింగ్‌లో ఉన్న పరీక్షా ఫలితాలను ప్రకటించడం పై దృష్టి సారించాలని రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఐక్యారాజ్య సమితి నివేదికను ప్రస్థావిస్తూ మహిళల్లో పేదరికం విపరీతంగా పెరిగిందని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జీవాలా అన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా ప్రకారం 40 కోట్ల మంది భారతీయులు అదనంగా దారిద్య్ర రేఖ దిగువకు చేరారని ఆయన అన్నారు. 64,371 టెక్నికల్ పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఫలితాలు ప్రకటించినా, ఇంత వరకు నియామకాలు జరపలేదని ఆయన విమర్శించారు. ఆర్‌ఆర్‌బిలో 1,03,769 గ్రూప్ డి ఖాళీలకు నోటిఫికేషన్ ఇచ్చినా, ఇంతవరకు నియామకాలు జరపలేదని, 1.16 కోట్ల మంది అభ్యర్థుల నుంచి దాదాపు 500 కోట్ల రూపాయలు వసూలు చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ అన్నారు.
చదవండి: నోట్ల రద్దు ‘అసంఘటితం’పై శరాఘాతం
Comments
Please login to add a commentAdd a comment