అలప్పుజలో ఓ చిన్నారి చెప్పు ఊడిపోతే తొడుగుతున్న రాహుల్‌గాంధీ
అలప్పుజ: ‘‘ప్రజల మధ్య సామరస్యం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు, అభివృద్ధి లేకుండా యువతకు ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు లేకపోతే మంచి భవిష్యత్తు ఉండదు’’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన ఆదివారం కేరళ రాష్ట్రంలోని వందనమ్ వద్ద బహిరంగ సభలో భారీ జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. అధికార బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. కాషాయ పార్టీ మతాలు, భాషల పేరిట దేశంలో ప్రజల నడుమ విభజన తీసుకొస్తోందని ఆరోపించారు.
ప్రధాని మోదీకి సన్నిహితులైన కొందరు బడా వ్యాపారవేత్తలు దేశంలో ఏ వ్యాపారాన్నైనా శాసించే స్థితికి చేరుకున్నారని, మరోవైపు సామాన్యులు మాత్రం బ్యాంకుల నుంచి కొద్దిపాటి రుణం కూడా పొందలేకపోతున్నారని ఆక్షేపించారు. ఈ నెల 7న ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర ఆదివారం 11వ రోజుకు చేరుకుంది. కేరళలోని వామపక్ష ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అశాస్త్రీయంగా నిర్మిస్తున్న రోడ్ల వల్ల జనం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అలప్పుజా జిల్లాలో ఆసుపత్రులను మెరుగుపర్చాలని అన్నారు.
దేశంలో రైతులు, నిరుద్యోగ యువత పరిస్థితి ఒకేలా ఉందని, వారు తమ కలలను నిజం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుకుంటూ ఉంటే ఎప్పటికీ ప్రగతి సాధించలేరని, మన దేశంలో బీజేపీ ఇప్పుడు అదే పని చేస్తోందని, ఇద్దరి మధ్య పోట్లాట సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఒకరిద్దరు సంపన్నులు తప్ప దేశ ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం పట్టడం లేదన్నారు. విద్వేషం, విభజన వంటివి దేశ సమస్యలను పరిష్కరించలేవని తేల్చిచెప్పారు. పాదయాత్రలో రాహుల్ గాంధీ రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ఇసుక మైనింగ్ వల్ల ప్రభావితమవుతున్న కుటుంబాలను కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment