Bharat Jodo Yatra: చీతాలు సరే, కొలువులేవి? | Bharat Jodo Yatra: Country plagued by unemployment, price rise, but PM focuses on cheetahs | Sakshi
Sakshi News home page

Bharat Jodo Yatra: చీతాలు సరే, కొలువులేవి?

Sep 18 2022 5:55 AM | Updated on Sep 18 2022 5:55 AM

Bharat Jodo Yatra: Country plagued by unemployment, price rise, but PM focuses on cheetahs - Sakshi

ఉద్యోగాలు కావాలంటూ భారత్‌ జోడో యాత్రలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న యువతతో రాహుల్‌

హరిపాద్‌ (కేరళ)/న్యూఢిల్లీ: ‘‘దేశంలో ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జనం ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను ప్రధాని గాలికొదిలేశారు. చీతాలను తెప్పించడంలో, వాటిని ఫొటోలు తీయడంలో బిజీగా ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్‌నేత రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. ఇది అర్థంపర్థం లేని పని అని వ్యాఖ్యానించారు.

రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర శనివారం కేరళలోని అలప్పుజ జిల్లా చేప్పాడ్‌లోకి ప్రవేశించింది. యువత ‘జాతీయ నిరుద్యోగ దినం’ అని తమ ఒంటిపై రాసుకొని ఆయనకు దారిపొడవునా స్వాగతం పలికారు. అనంతరం భారీ బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగించారు. చీతాలను రప్పించానంటున్న మోదీ గత 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ నెరవేర్చడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. ముందు నిరుద్యోగం, ధరల కట్టడిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

‘‘చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు, శ్రామికులపై కేంద్రం వ్యవస్థీకృతంగా దాడి చేస్తోంది. ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారవేత్తలే దేశ సంపదనంతా నియంత్రిస్తున్నారు. వారు ఏ వ్యాపారంలోకైనా ప్రవేశించి, అప్పటికే ఉన్నవారిని వెళ్లగొట్టగలరు. ఉద్యోగాలు దొరక్క యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కోట్లాది జనం పేదరికంలోకి జారుకుంటున్నారు. ఈ బడా వ్యాపారులు మాత్రం దేశంలో ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు, విద్యుత్, వ్యవసాయం వంటి అన్ని రంగాలను సొంతం చేసుకుంటున్నారు’’ అంటూ వాపోయారు. 

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ గత ఎనిమిదేళ్లలో ఇచ్చింది కేవలం 7 లక్షల  కొలువులంటూ మండిపడ్డారు. ‘‘ఉద్యోగాలు సాధించే తీరతామంటూ యువత నినదిస్తోంది. వినిపిస్తోందా?’’ అంటూ ట్వీట్‌ చేశారు. జాతీయ నిరుద్యోగ దినం అంటూ హాష్‌టాగ్‌ జత చేశారు. మోదీ జన్మదినం సందర్భంగా శనివారాన్ని జాతీయ నిరుద్యోగ దినంగా యువత జరుపుకుంటోందని కాంగ్రెస్‌ పేర్కొంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయిని కరునాగపల్లి సమీపంలోని ఆమె ఆశ్రమంలో రాహుల్‌ కలుసుకున్నారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమమానికి ఎనలేని కృషి సాగిస్తున్నారని కొనియాడారు.

నల్ల దుస్తులతో కాంగ్రెస్‌ నిరసనలు
నిరుద్యోగ సమస్యను తక్షణం పరిష్కరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. యువజన కాంగ్రెస్‌ నేతలు శనివారం దేశవ్యాప్తంగా నల్ల దుస్తులు ధరించి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరుద్యోగ మేళాలు నిర్వహించారు. ‘‘దేశంలో నిరుద్యోగిత రేటు కరోనాకు ముందే 45 ఏళ్ల గరిష్టానికి చేరింది. 20–24 ఏళ్ల వయసువారిలో 42 శాతం నిరుద్యోగులే’’ అంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినేట్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘కుబేరుల వ్యాపారాలే ముందుగా లబ్దిపొందుతున్నాయి. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మోదీ సర్కార్‌ పథకాల ప్రయోజనాలు చిట్టచివరన దక్కుతున్నాయి’’ అని అన్నారు. మోదీ ప్రభుత్వమొచ్చి యువతకు నిరుద్యోగాన్ని బహుమతిగా ఇచ్చిందని ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement