సిలిగురిలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న రాహుల్
సిలిగురి: దేశంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి పశ్చిమబెంగాల్, బెంగాలీలు నాయకత్వం వహించాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం సిలిగురిలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. యాత్రకు లభిస్తున్న ఆదరణకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘స్వాతంత్య్ర పోరాట సమయంలో సైద్ధాంతిక పోరాటానికి నాయకత్వం వహించిన బెంగాల్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
అన్యాయాన్ని ఎదుర్కోవడం, ఐక్యతను పెంపొందించడం, విద్వేష వ్యాప్తిని అరికట్టడం బెంగాల్, బెంగాలీల కర్తవ్యం. ‘మీరు సందర్భానికి తగినట్లుగా స్పందించకుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు, ఇది ఏ ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు. బెంగాల్ ఈ పోరాటానికి నాయకత్వం వహించాలి’అని రాహుల్ ఉద్ఘాటించారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను, హింసను పెంచుతోంది.
నిరుపేదలు, యువతకు బదులుగా కొందరు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తోంది’అని మండిపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన టీఎంసీ లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం, ఆ పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీని సముదాయించేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రయత్నాలు జరుగుతున్న వేళ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఎంసీ స్పందించింది.
నిజమే, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముందుండి పోరాడిన చరిత్ర బెంగాలీలకు ఉంది. సీఎం మమతా బెనర్జీ సైతం ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ నాయకత్వం మాత్రం రాష్ట్రంలో కాషాయదళంతో అంటకాగుతోంది’అని టీఎంసీ నేత శంతను సేన్ ఆరోపించారు. న్యాయ్ యాత్ర సోమవారం ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లా నుంచి బిహార్‌లోకి ప్రవేశించనుంది.
Comments
Please login to add a commentAdd a comment