
ఇటీవలి కాలంలో తరచూ రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని నివారించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ పలు చర్యలు చేపడుతోంది. తాజాగా ఏఐ సాయంతో ట్రాక్‌లపై భద్రతను పెంచే దిశగా ముందుకు కదులుతోంది.
ఆగస్టు 17న అహ్మదాబాద్‌కు వెళ్లే సబర్మతి ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ - భీమ్‌సేన్ జంక్షన్ మధ్య పట్టాలు తప్పింది. ఎవరో పట్టాలపై ఉంచిన భారీ వస్తువును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు రైల్వేశాఖ గుర్తించింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైల్వే ట్రాక్‌లపై పెట్రోలింగ్‌ను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) సాయం తీసుకోవాలని వారు భావిస్తున్నారు.
ఆర్‌పీఎఫ్‌తో పాటు ట్రాక్ మెయింటెనెన్స్ సిబ్బంది ఏడాది పొడవునా క్రమ వ్యవధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. కాగా సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం తర్వాత వారు మరింత అప్రమత్తంగా ఉన్నారని రైల్వే బోర్డు అధికారులు మీడియాకు తెలిపారు. అయితే ట్రాక్‌ల నిర్వహణకు సిబ్బంది కొరత కారణంగా ఏడాది పొడవునా నైట్ పెట్రోలింగ్ నిర్వహించడం లేదని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం విషయానికొస్తే ఈ సంఘటనకు ముందు నైట్ పెట్రోలింగ్ చేయలేదని అందుకే ప్రమాదం చోటుచేసుకున్నదని అధికారులు గుర్తించారు. రైలు రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఎవరైనా ఆ భారీ వస్తువును పట్టాలపై ఉంచారా? అనే కోణంలో రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment