తమిళనాడులో శుక్రవారం రాత్రి మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఏకంగా 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ వద్ద రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై తాజాగా దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ స్పందించారు. మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సిగ్నల్, రూట్ మధ్య అసమతుల్యతే కారణమని తెలిపారు.
‘‘మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు మారాలి, కానీ ఏదో తప్పు జరిగింది. గూడ్స్ రైలు నిలిచిన ట్రాక్‌లోని ఎక్స్‌ప్రెస్ రైలు రూట్ మార్చబడింది. సరిగ్గా ఏమి జరిగిందో ఇప్పడే ఏం చెప్పలేం. ఎక్స్‌ప్రెస్ రైలు గూడూరుకు (ఆంధ్రప్రదేశ్‌లోని) వెళుతోంది. ఇది తిరువళ్లూరులోని కవరైప్పెట్టై రైల్వే స్టేషన్‌లో ఆగింది. అక్కడ గూడూరుకు వెళ్లే గూడ్స్ రైలు కూడా లూప్ లైన్‌లో ఉంది. అయితే మెయిన్ లైన్‌కు సిగ్నల్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ.. ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి వెనుక నుంచి గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పడానికి దారి తీస్తుంది.
ఇక.. ఈ ప్రమాదంలో 12 కోచ్‌లు పట్టాలు తప్పగా.. 19 మంది గాయపడ్డారు. ఎక్స్‌ప్రెస్ రైలులో 1,300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎక్స్‌ప్రెస్ రైలులోని ఓ పవర్ కారు కూడా మంటల్లో చిక్కుకుంది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో రైలు పట్టాలు తప్పడంతో మరమ్మతుల కారణంగా శనివారం షెడ్యూల్ చేసిన 18 రైళ్లు రద్దు చేయబడ్డాయి. కొన్ని రైళ్లను దారి మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment