న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అస్సాంలోని తేజ్‌పూర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి కొన్ని ప్రాంతాలలో వివాదాలను పరిష్కరించడానికి భారత్- చైనాలు దౌత్య, సైనిక చర్చలు జరుపుతున్నాయని అన్నారు.
ఇరు దేశాల నిరంతర ప్రయత్నాల తర్వాత ఏకాభిప్రాయం కుదిరింది. సైనిక బలగాల క్రమశిక్షణ, ధైర్యం వల్లే ఈ విజయం సాధించాం. ఏకాభిప్రాయ ప్రాతిపదికన శాంతి పునరుద్ధరణ ప్రక్రియను కొనసాగిస్తామని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల దృఢమైన నిబద్ధత, అద్భుతమైన ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు.
యువతకు నిజమైన స్పూర్తిదాయకంగా ఉంటూ, అంకితభావంతో మాతృభూమికి సేవ చేస్తున్న సైనికులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వైమానిక యోధులు సవాళ్లను ఎదుర్కోవడానికి నిత్యం సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. వైమానిక దళ సిబ్బంది అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment