లక్నో: అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు సెప్టెంబర్ 17 తర్వాత ప్రారంభమవుతాయని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శనివారం తెలిపారు. హిందువులు తమ పూర్వీకులకు కృతజ్ఞతలు తెలిపిన కాలం పిత్రు పక్షం ఈనెల 17 వరకు ముగియనుందని ఆ తరువాత పనులు ప్రారంభమై నిరాటంకంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించడానికి దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు లార్సెన్, టౌబ్రో సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆలయ పునాది కోసం సుమారు 1,200 స్తంభాలను భూమి నుంచి 100 అడుగుల లోతులో వేయనున్నట్లు తెలిపారు. ఈ స్తంభాలు రాతి, ఇనుముతో చేయబడి ఉంటాయన్నారు. (చదవండి: మసీదు నిర్మాణానికి పిలుపు అందితే వెళ్తారా?)
మందిర నిర్మాణం కోసం ఈ సంస్థలు ముంబై, హైదరాబాద్ నుంచి భారీ యంత్రాలను తీసుకు రానున్నట్లు తెలిపారు. సుమారు 100 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారని.. వారందరికీ ముందే కరోనా పరీక్షలు చేయిస్తామన్నారు. థర్మల్ స్రీనింగ్ తర్వాతే విధుల్లోకి అనుమతిస్తామని తెలిపారు. ఈ వారం ప్రారంభంలో, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ఏడీఏ) రెండు లేఅవుట్లను ఆమోదించింది. ఒకటి రామ మందిరానికి సంబంధించింది కాగా మరొకటి మొత్తం రామ జన్మభూమి క్యాంపస్ లే అవుట్. ఇప్పటికే ఏడీఏ బ్యాంక్ ఖాతాలో మందిర నిర్మణానికి అవసరమైన 2.11 కోట్ల రూపాయలను జమ చేసింది. సెప్టెంబర్ 4 న లే అవుట్‌లను ట్రస్ట్‌కు అప్పగించింది.
ప్రతిపాదిత రామ్ మందిరం 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు మరియు 161 అడుగుల ఎత్తుతో ఐదు గోపురాలను కలిగి ఉంటుంది. ట్రస్ట్ ప్రకారం.. ఆధునిక పద్ధతులను ఉపయోగించి ఆలయ పునాది వేయబడుతుంది, తద్వారా ఇది 1,500 సంవత్సరాలకు పైగా మన్నికగా ఉండగా మందిర నిర్మాణం 1,000 సంవత్సరాల వరకు చెక్కు చెదరదు. భూకంపాలు, తుఫానులను తట్టుకోగలిగే విధంగా ఆలయ పునాదిని బలోపేతం చేయడానికి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిబిఆర్ఐ), రూర్కీ, ఐఐటీ మద్రాసుల నిపుణులు ముందుకు వచ్చారు. దశాబ్దాల నాటి అయోధ్య వివాదాలో రామ్ మందిరానికి అనుకూలంగా 2019 నవంబర్ 9 న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గత నెలలో అయోధ్యలో భూమి పూజ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆలయానికి పునాది వేశారు.
Comments
Please login to add a commentAdd a comment