
ఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన జరిగే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకలకు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందగా, దేశ విదేశాల్లో ఉన్న 10 కోట్ల కుటుంబాలకు ఆహ్వానం పలకాలని వీహెచ్‌పీ నిర్ణయించింది. జనవరి 1వ తేదీ నుంచి ఈ ఆహ్వాన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వీహెచ్‌పీ ప్రతినిధులు తెలిపారు.
అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకు పైగా దేవాలయాల్లో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. రామమందిరం ప్రారంభోత్సవంలో భాగంగా అయోధ్యలో నిర్వహించే మహాభిషేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికి శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.
దేశవ్యాప్తంగా ప్రజలకు అక్షతలు పంపిణీ
ఇటీవలే అయోధ్యలో శ్రీరామ మందిరంలో ప్రతిష్టాపన పూజలు సంప్రదాయం ప్రకారం అక్షత పూజతో మొదలయ్యాయి. ఆలయంలోని రామదర్బార్, శ్రీరాముని ఆస్థానంలో పసుపు, దేశవాళీ నెయ్యి కలిపిన 100 క్వింటాళ్ల బియ్యంతో అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దేశంలోని 45 ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కు చెందిన 90 మంది ముఖ్యులకు 5 కిలోల మేర అక్షతలను పంపిణీ చేస్తారు.
వీరు వీటిని జిల్లాలు, బ్లాకులు, తహసీల్‌లు, గ్రామాల ప్రతినిధులకు అందజేస్తారని ట్రస్ట్ కార్యదర్శి చంపత్‌రాయ్ చెప్పారు. మిగతా అక్షతలను ఆలయంలోని శ్రీరాముని విగ్రహం ఎదురుగా కలశంలో ఉంచుతారు. వీరు ఈ అక్షతలను వీరు వచ్చే జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన జరిగేలోగా దేశవ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయనున్నారని ట్రస్ట్ తెలిపింది.
రామమందిరం కోసం అరుదైన కానుక
అయోధ్యలో రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన ఒక కళాకారుడు అరుదైన కానుకను రూపొందించాడు. చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన సత్యప్రకాశ్ శర్మ రాముడి మందిరం కోసం ప్రత్యేకంగా 400 కేజీల తాళం తయారు చేశాడు. శ్రీరాముడికి వీరభక్తుడైన సత్యప్రకాశ్ ప్రపంచంలో చేత్తో తయారు చేసిన అతి పెద్ద తాళమని చెప్పారు.
ఈ తాళం 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంది. తాళం చెవి నాలుగడుగుల పొడవుంది. సత్యప్రకాశ్ శర్మ కుటుంబం తరాలుగా ఈ తాళాల తయారీ వృత్తిలోనే ఉంది.ఈ ఏడాది మొదట్లో అలీగఢ్ ఎగ్జిబిషన్‌లో ఈ తాళాన్ని ఉంచారు. తాళం తయారు చేయడంలో తన భార్య రుక్మిణి కూడా సాయం చేశారని చెప్పారు. ఈ తాళం తయారీకి ఆయనకి రూ.2 లక్షల ఖర్చయింది. ఈ ఏడాది చివర్లో ఆయన ఈ తాళాన్ని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి సమర్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment