సాక్షి, బెంగళూరు: రాసలీలల వీడియో సీడీ కేసులో ఇరుక్కున్న కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆదివారం రాత్రి ఆయనకు టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. ఆయన బెళగావి జిల్లా గోకాక్‌లో ఆస్పత్రిలో ఐసీయూలో చేరారు. మరో నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఆయన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగంలో చికిత్స చేస్తున్నట్లు ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ రవీంద్ర తెలిపారు. బీపీ, షుగర్ నియంత్రణలోకి రాలేదని చెప్పారు. మహారాష్ట్ర, బెంగళూరు పర్యటనల్లో కరోనా సోకినట్లు భావిస్తున్నారు. నిజానికి సోమవారం ఆయన బెంగళూరులో సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన సిట్ విచారణకు రాకపోవడం ఇది నాలుగోసారి.
గోకాక్ ఆస్పత్రిలో లేరు: యువతి న్యాయవాది
రమేశ్ జార్కిహోళి గోకాక్ తాలూకా ఆస్పత్రిలో లేరని సీడీ కేసులో బాధిత యువతి తరఫు న్యాయవాది జగదీశ్ ఆరోపించారు. తనకు తెలిసిన వారు ఆస్పత్రికి వెళ్లి చూడగా అక్కడ లేరన్నారు. సిట్ విచారణకు రాకుండా కరోనా, ఐసీయూ అని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
నేను కిడ్నాప్ కాలేదు: యువతి
రాసలీలల వీడియో సీడీ కేసులో బాధిత యువతి.. తననెవరూ కిడ్నాప్ చెయ్యలేదని కోర్టులో తెలిపింది. తమ కుమార్తె కిడ్నాప్ అయినట్లు ఆమె తల్లిదండ్రులు బెంగళూరు ఆర్‌టీ నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె సోమవారం సాయంత్రం కోర్టుకు హాజరై తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుమారు 100 మంది పోలీసులతో కోర్టు వద్ద బందోబస్తు ఏర్పాటైంది.
రాసలీలల కేసును సీబీఐకి ఇవ్వాలని ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను బెంగళూరు హైకోర్టు విచారించి కేసు పురోగతి నివేదికను అందజేయాలని సిట్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. మరోవైపు తమ కుమార్తె చెప్పే మాటలను పరిగణించరాదని ఆమె తండ్రి హైకోర్టులో అర్జీ వేశారు. ఆమె మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళికి, ప్రత్యేక విచారణ బృందానికి ఇటీవల వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుండడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment