
ఒడిశాలో జన్మించిన అరుదైన నవజాత కవల శిశువులు
భువనేశ్వర్: తన కడుపులో కవలలు ఊపిరిపోసుకుంటున్నారు అని తెలిసిన దగ్గర నుంచి ఆ తల్లి సంతోషం అంతా ఇంతా కాదు. ఒకేసారి ఇద్దరు చిన్నారులు తమ కుటుంబంలోకి రాబోతున్నారనే విషయం తెలిసిన నాటి నుంచి ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. చిన్నారుల రాక కోసం కుటుంబంలోని అందరూ కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఫలించాయి.. ఆ తల్లి బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన పసికందులను చూసి ఆ మాతృహృదయం తల్లడిల్లిపోయింది. చిన్నారులను చూసిన కుటుంబ సభ్యులు బాధతో విలవిల్లాడారు. బిడ్డలు జన్మించినందుకు సంతోషించాలా.. లేక ఇలా అతుక్కుని పుట్టినందుకు బాధపడాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారి బాధ ఆస్పత్రిలో పత్రి ఒక్కరిని కదిలిస్తోంది.
ఇంతకు ఆ చిన్నారులకు ఏమయ్యింది అంటే వారి తలలు మాత్రం వేరుగా ఉండగా.. శరీరాలు కలిసి పోయాయి. ఇక ఇద్దరు బిడ్డలకు కేవలం మూడు చేతులు, రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. వీరిని చూసిన ప్రతి ఒక్కరు కంట తడి పెడుతున్నారు. వైద్యులను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ సంఘటన ఆదివారం ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. రాజ్ నగర్ ప్రాంతంలోని కని గ్రామంలో నివసించే ఉమకాంత్ పరిదా, అతని భార్య అంబికాకు ఈ అరుదైన కవల శిశువులు జన్మించారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న అంబికాను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సీ సెక్షన్ ద్వారా బిడ్డలకు జన్మనిచ్చింది అంబికా. ఇక పుట్టిన శిశువుల శరీరాలు అతుక్కుపోయి ఉన్నాయి. తలలు మాత్రం వేరుగా ఉండగా.. ఇద్దరు కవలలకు మూడు చేతులు, రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి.
అరుదైన సమస్యతో జన్మించిన ఈ నవజాత కవల శివువులను వెంటనే కేంద్రపారాలోని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఓ వైద్యురాలు మాట్లాడుతూ.. ‘‘పిల్లల పరిస్థితి నిలకడగానే ఉంది. రెండు తలలు ఉండటంతో చిన్నారులు ఇద్దరు వేర్వేరుగా తినడం, శ్వాసించడం చేస్తున్నారు. కాకపోతే వారు ఒకే శరీరం.. మూడు చేతుల, రెండు కాళ్లను పంచుకున్నారు. ప్రత్యేక చికిత్స కోసం శిశువులిద్దరిని కటక్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్ (సిషు భవన్) కు తరలించాము’’అని తెలిపారు. తమ బిడ్డలను ఆదుకోవాల్సిందిగా శిశువుల తండ్రి ఒడిశా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
చదవండి: కడుపు అతుక్కుని కవలల జననం
Comments
Please login to add a commentAdd a comment