conjoined twins
-
Philadelphia: అవిభక్త కవలల సర్జరీ సక్సెస్
అవిభక్త కవలలుగా పుట్టిన ఇద్దరు అబ్బాయిలను విజయవంతంగా వేరుచేసి వారికి పునర్జన్మనిచ్చింది అమెరికాలోని ఓ పిల్లల ఆసుపత్రి. వేరుచేశాక గత నెల 29న ఈ చిన్నారులు తొలి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో నివసిస్తున్న షనేకా రూఫిన్, టిమ్ దంపతులకు అవిభక్త కవల పిల్లలు జన్మించారు. ఆ అబ్బాయిలకు అమరీ, జవార్ రూఫిన్ అని పేర్లు పెట్టుకున్నారు. కౌగిలించుకున్నట్లుగా ఎదురెదురుగా పొట్ట ప్రాంతమంతా అతుక్కుని పుట్టారు. పుట్టినప్పుడు ఇద్దరి బరువు కలిపి కేవలం 2.7 కేజీలు మాత్రమే. వాస్తవానికి అవిభక్తవ కవలల తల్లి షనేకా రూఫిన్ 12 వారాల గర్భంతో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నప్పుడు గర్భస్త శిశువులు అతుక్కున్నట్లు కనిపించింది. పుట్టే చిన్నారులకు శారీరక సమస్యలు వస్తాయని, ఆనాడే తల్లిని వైద్యులు హెచ్చరించారు. తల్లి మనసు ఊరుకోదుగా. గర్భస్రావం చేయించుకోనని తెగేసి చెప్పింది. ఎలాగైనా నవమాసాలు మోసి పిల్లలకు జన్మనిస్తానని కరాఖండీగా చెప్పేసింది. భర్త టిమ్ సైతం ఆమె నిర్ణయానికి అడ్డుచెప్పలేదు. పిల్లలు అతుక్కుని పుడితే వచ్చే సమస్యలను పరిష్కారం కనుగొనేందుకు మరో ఆస్పత్రిని వెతికారు. అప్పుడే వాళ్లకు ‘చాప్’ చిల్డ్రెన్స్ ఆసుపత్రి ఆశాదీపంగా కనిపించింది. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా చిన్నారులను అతుక్కుని పుట్టినాసరే వేరుచేయవచ్చని అక్కడి వైద్యులు భరోసా ఇచ్చారు. పిల్లల ఉమ్మడి శరీరంలో పొట్టతోపాటు కాలేయంలో కొంత భాగం కలిసే ఉంది. పిల్లలకు 11 నెలల వయసు వచ్చాక ఆపరేషన్‌కు రంగం సిద్ధమైంది. ఆగస్ట్ 21వ తేదీన 24 మందికిపైగా నిష్ణాతులైన వైద్యులు, మత్తుమందు డాక్టర్లు, రేడియాలజిస్టులు, నర్సులు ఇలా భారీ వైద్యబృందం ఏకధాటిగా ఎనిమిది గంటలపాటు శ్రమించి చిన్నారులను విజయవంతంగా వేరుచేసింది. పొట్టను వేరుచేసేటపుడు ఎలాంటి ఇన్ఫెక్షన్ కలగకుండా మెష్, ప్లాస్టిక్ సర్జరీ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించి వారిని వేరుచేశాక ఇద్దరి పొత్తి కడుపులను జాగ్రత్తగా బయటి నుంచి కుట్టేశారు. కొద్దిరోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణ తర్వాత చిన్నారులను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్‌కు ముందు ఆస్పత్రి యాజమాన్యం గత నెల 29వ తేదీన ఘనంగా వీళ్ల పుట్టినరోజు వేడుక జరిపింది. ‘‘ఇద్దరినీ ఇలా వేరువేరుగా చూడటం వర్ణనాతీతమైన అనుభూతినిస్తోంది’’ అని తల్లి రూఫిన్ ఆనందం వ్యక్తంచేశారు. టిమ్ దంపతులకు అంతకుముందే కైలమ్, అనోరా అనే ఇద్దరు పిల్లలున్నారు. ‘‘ఆపరేషన్ తర్వాత మా కుటుంబసభ్యుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఆనందమయ జీవన ప్రయాణాన్ని ఇక ఆరంభిస్తాం. దీనిని సుసాధ్యం చేసిన నిపుణుల బృందానికి మా కృతజ్ఞతలు’’ అని తల్లి చెప్పారు. ప్రతి 35వేల నుంచి 80వేల కవలల జననాల్లో ఇలా అవిభక్త కవలలు పుడతారని వైద్యశాస్త్రం చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవిభక్త కవలలకు వివాహం.. వరుడెవరంటే..
అమెరికాకు చెందిన అవిభక్త కవలలు (కంజోయిన్డ్ ట్విన్స్)అబ్బి, బ్రిట్నీ హెన్సెల్‌లు రిటైర్డ్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకుని ముఖ్యాంశాలలో నిలిచారు. 1996లో ‘ది ఓప్రా విన్ఫ్రే షో’లో కనిపించి, ఇద్దరూ తొలిసారి వెలుగులోకి వచ్చారు. తాజాగా ఈ అవిభక్త కవలలు అమెరికా ఆర్మీ రిటైర్డ్ అధికారి జోష్ బౌలింగ్‌ను వివాహం చేసుకున్నారు. బ్రిట్నీ హాన్సెల్ ఫేస్బుక్ ప్రొఫైల్‌లో వారి పెళ్లి ఫొటో ప్రత్యక్షమయ్యింది. దానిలో పెళ్లి దుస్తుల్లో ఈ అవిభక్త కవలలు జోష్ బౌలింగ్ ముందు నిలబడి అతని చేతిని పట్టుకోవడాన్ని చూడవచ్చు. ఈ కవల సోదరీమణులు ప్రస్తుతం ఐదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వీరు వీరి స్వస్థలమైన మిన్నెసోటాలో నివసిస్తున్నారు. మరోవైపు జోష్ బౌలింగ్ ఫేస్బుక్ పేజీలో అతను ఆ అవిభక్త కవలలకు ఐస్ క్రీం అందిస్తున్న ఫొటోలు, వెకేషన్ ఫోటోలు ఉన్నాయి. వీరి వివాహానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. దానిలో వారు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అబ్బి, బ్రిట్నీ హెన్సెల్ల శరీరం కలసిపోయివుంటుంది. అబ్బి కుడి చేయి , కుడి కాలును నియంత్రిస్తుండగా, బ్రిట్నీ ఎడమ వైపు అవయవాలను నియంత్రిస్తుంది. -
మాయా లేదు.. మంత్రం లేదు, వాళ్లంతే : అయితేనేం..!
ఆ ఇద్దరిదీ ఒకటే జననం. ఒకే తల్లి కడుపున ఒక్కటిగానే పుట్టారు. అందరిలాగానే రెండు గుండెలు, రెండు మెదడులు, రెండు చేతులు ఉన్నాయి. కానీ కాళ్లు మాత్రం రెండే. అదేంటి అనుకుంటున్నారా. మన వీణా వాణిలాగా పంజాబ్‌కు చెందిన సోహ్నా-మోహనా ఇద్దరూ అవిభక్త కలలు. మరి వీరి జీవనం ఎలా సాగుతోంది? ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారా? తెలుసుకుందాం రండి! 2003, జూన్ 14న ఢిల్లీలోని సుచేత కృపలానీ హాస్పిటల్లో జన్మించారు ఈ కవలలు. డెలివరీ చేసిన డాక్టర్ కూడా వీరిని చూసి విస్తుపోయారు. చాలా అరుదైన పరిస్థితిలో వీరు జన్మించారు. శరీరంలోని పై భాగం అంతా విడి విడిగానే ఉంటుంది. కానీ తుంటినుంచి దిగువ భాగంమాత్రం కలిసిపోయింది. పిత్తాశయం, ప్లీహము ఒకటే. అలాగే ఇద్దరికీ కలిపి రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. వీరిని విడదీసే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు తేల్చారు. ఈ పిల్లల తండ్రి సుర్జిత్ కుమార్ టాక్సీ డ్రైవర్. వారికి అప్పటికే 3 కుమార్తెలు ఉన్నారు. దీంతో కవల శిశువులను పోషించలేమని రెండు నెలల వయస్సులో వారిని విడిచిపెట్టారు. దీంతో వీరిని ఢిల్లీలోని AIIMకి తరలించారు. తరువాత అంటే 2003 ఆగస్టు 15న అమృత్‌సర్‌లోని షెల్టర్‌హోమ్ ఆల్ ఇండియా పింగళ్వార ఛారిటబుల్ సొసైటీ దత్తత తీసుకుంది. డాక్టర్ ఇందర్జిత్ కౌర్ చాలా ఆదరంగా పోషించడమే కాదు, సోహ్నా సింగ్, మోహనా సింగ్ అంటూ నామకరణం చేశారు. వీరి ఫస్ట్ బర్త్‌డే పార్టీని కూడా ఘనంగా నిర్వహించారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) పీఎస్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు ఐటీఐ డిప్లొమా (ఎలక్ట్రీషియన్) పూర్తి చేసిన ఈ కవలలు పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL)లో ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగాలు సాధించారు. ఇద్దరీ ఆలోచనలు వేరు, వేరు వీరి శరీరంలో రెండు మెదళ్లు ఉన్నాయి. అందుకే నేమో ఇద్దరికీ విలక్షణమైన వ్యక్తిత్వాలు,అభిప్రాయాలు ఉన్నాయి. సోహ్నా సింగ్ డామినేటింగ్‌గా, చురుగ్గా ఉంటాడు. మోహనా సింగ్ మౌనంగా, సున్నితంగా ఉంటాడు. ఇద్దిరికీ ఓటు హక్కు, వేర్వేరు ఓటర్ ఐడీలు సోహ్నా-మోహనా ఓటు వేశారు వీరి ప్రత్యేక పరిస్థితిని అర్థం చేసుకున్నఎన్నికల సంఘం ఇద్దరికీ వేర్వేరుగా ఓటర్ కార్డులను ఇవ్వడం విశేషం. అమృత్‌సర్‌లోని మనవాల్‌లో ఇద్దరు వేర్వేరు ఓటర్లుగా తొలిసారి ఓటు వేశారు. -
ఆపరేషన్ చేస్తే వీణా-వాణీలకు ముప్పు.. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా– వాణీలకు శస్త్ర చికిత్స చేసి విడదీసేందుకు విదేశాల నుంచి వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించామని.. శస్త్రచికిత్స చేస్తే వారి ప్రాణా లకు ప్రమాదం ఏర్పడవచ్చని వైద్యులు స్పష్టం చేశారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. దీంతో వీణా–వాణీల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు శస్త్రచికిత్స చేయించాలన్న ప్రయత్నాన్ని విరమించుకున్నామని తెలిపింది. వీణా–వాణీలకు శస్త్రచికిత్స చేయాలని, వారికి హైదరాబాద్ లేదా వరంగల్‌లో నివాసం మంజూరు చేసేలా ఆదేశించాలంటూ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ 2016లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలిల ధర్మాసనం శుక్ర వారం మరోసారి విచారించింది.భవిష్యత్తులో వారి వైద్య చికిత్సలకయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వివరించారు. 9 ఏళ్లుగా వారు ఆసుపత్రిలోనే ఉన్నారని, వారి యోగ క్షేమాలన్నీ ప్రభుత్వమే చూసిందని తెలిపారు. ఇద్దరూ ఇంటర్ చదువుతున్నారని వివరించారు. వీణా–వాణీల ఉన్నత చదువు, ఇతర ఖర్చులకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ నెలకు రూ.15 వేలు సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని ఫౌండేషన్ తరపు న్యాయవాది నివేదించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ను ధర్మాసనం అభినందించింది. -
అవిభక్త కవలలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు!!
అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా సరిగా చదవకుండా ఏవో సాకులు చెబుతూ కాలక్షేపం చేయడం. సరైన ఉద్యోగం లేక నిరుద్యోగిగా కాలం వెళ్లదీసేవారు కొందరు. కానీ అమృతసర్ అవిభక్త కలలు తమ శారరీక లోపాన్ని అధిగమించి మరీ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. (చదవండి: ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే...అమృత్‌సర్‌కి చెందిన అవిభక్త కవలలు సోహ్నా, మోహనా న్యూ ఢిల్లీలో జూన్ 14, 2003న జన్మించారు. అయితే వీరికి రెండు హృదయాలు, చేతులు, మూత్రపిండాలు, వెన్నుపాములతో జన్మించారు. కానీ వీరికి ఒకటే కాలేయం, పిత్తాశయం, కాళ్లు ఉన్నాయి. అయితే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారిని పరీక్షించి శస్త్రచికిత్స వల్ల ప్రాణాంతకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున వేరు చేయకూడదని నిర్ణయించారు. దీనికి తోడు పుట్టిన వెంటనే తల్లిదండ్రుల నిరాధరణకు గురయ్యారు. ఈ మేరకు పిగల్వార్ సంస్థ చదువు చెప్పించడమే కాక వీరి బాగోగులను చూసుకుంది. అంతేకాదు వారు తమ శారీరక లోపాన్ని అధిగమించి కష్టపడి చదువుకోవడమే కాక పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్‌పీసీఎల్)లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. పైగా వారికి ఆ రంగంలో అనుభవం ఉన్నందున వారిని నియమించకున్నట్లు పీఎస్‌పీసీఎల్ సబ్‌స్టేషన్ జూనియర్ ఇంజనీర్ రవీందర్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆ అవిభక్త కవలలు మాట్లాడుతూ...తమకు ఈ ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. పైగా మాకు ఈ అవకాశం ఇచ్చిన పంజాబ్ ప్రభుత్వానికి తమ విద్యనందించిన పింగల్వార్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం" అని అన్నారు. (చదవండి: హై పవర్ ట్రాన్స్మిషన్ తీగపై వేలాడుతూ.. స్వీట్లు, మొబైల్ కావాలంటూ..) -
పాపం పసివాళ్లు: 2 తలలు, 3 చేతులతో కవలలు
భువనేశ్వర్: తన కడుపులో కవలలు ఊపిరిపోసుకుంటున్నారు అని తెలిసిన దగ్గర నుంచి ఆ తల్లి సంతోషం అంతా ఇంతా కాదు. ఒకేసారి ఇద్దరు చిన్నారులు తమ కుటుంబంలోకి రాబోతున్నారనే విషయం తెలిసిన నాటి నుంచి ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. చిన్నారుల రాక కోసం కుటుంబంలోని అందరూ కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఫలించాయి.. ఆ తల్లి బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన పసికందులను చూసి ఆ మాతృహృదయం తల్లడిల్లిపోయింది. చిన్నారులను చూసిన కుటుంబ సభ్యులు బాధతో విలవిల్లాడారు. బిడ్డలు జన్మించినందుకు సంతోషించాలా.. లేక ఇలా అతుక్కుని పుట్టినందుకు బాధపడాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారి బాధ ఆస్పత్రిలో పత్రి ఒక్కరిని కదిలిస్తోంది. ఇంతకు ఆ చిన్నారులకు ఏమయ్యింది అంటే వారి తలలు మాత్రం వేరుగా ఉండగా.. శరీరాలు కలిసి పోయాయి. ఇక ఇద్దరు బిడ్డలకు కేవలం మూడు చేతులు, రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. వీరిని చూసిన ప్రతి ఒక్కరు కంట తడి పెడుతున్నారు. వైద్యులను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ సంఘటన ఆదివారం ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. రాజ్ నగర్ ప్రాంతంలోని కని గ్రామంలో నివసించే ఉమకాంత్ పరిదా, అతని భార్య అంబికాకు ఈ అరుదైన కవల శిశువులు జన్మించారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న అంబికాను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సీ సెక్షన్ ద్వారా బిడ్డలకు జన్మనిచ్చింది అంబికా. ఇక పుట్టిన శిశువుల శరీరాలు అతుక్కుపోయి ఉన్నాయి. తలలు మాత్రం వేరుగా ఉండగా.. ఇద్దరు కవలలకు మూడు చేతులు, రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. అరుదైన సమస్యతో జన్మించిన ఈ నవజాత కవల శివువులను వెంటనే కేంద్రపారాలోని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఓ వైద్యురాలు మాట్లాడుతూ.. ‘‘పిల్లల పరిస్థితి నిలకడగానే ఉంది. రెండు తలలు ఉండటంతో చిన్నారులు ఇద్దరు వేర్వేరుగా తినడం, శ్వాసించడం చేస్తున్నారు. కాకపోతే వారు ఒకే శరీరం.. మూడు చేతుల, రెండు కాళ్లను పంచుకున్నారు. ప్రత్యేక చికిత్స కోసం శిశువులిద్దరిని కటక్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్ (సిషు భవన్) కు తరలించాము’’అని తెలిపారు. తమ బిడ్డలను ఆదుకోవాల్సిందిగా శిశువుల తండ్రి ఒడిశా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. చదవండి: కడుపు అతుక్కుని కవలల జననం -
స్వయంగా పరీక్ష రాసిన వీణావాణీలు
వెంగళరావునగర్: విధి పరీక్షను చిర్నవ్వుతో ఎదుర్కొంటూనే పాఠాలు నేర్చుకున్న అవిభక్త కవలలైన వీణావాణీలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన టెన్త్ పరీక్షలకు హాజరై తమ ఆత్మస్థైర్యాన్ని చాటి తమలాంటి మరెందరికో స్ఫూర్తినిచ్చారు. స్టేట్‌హోంలోని బాలసదన్ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలో ఉన్న ప్రతిభా హైస్కూల్లోని పరీక్షా కేంద్రానికి ఉదయం 8.45 గంటలకు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా వీరిని తీసుకొచ్చారు. బాలసదన్ ఇన్చార్జి సఫియా బేగంతో పాటు మరో సహాయకురాలు వీరితో పాటు వెంటవచ్చారు. పరీక్ష రాసేందుకు వీరిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం స్క్రైబర్స్‌ను ఏర్పాటు చేసినప్పటికీ వారిద్వారా పరీక్ష రాసేందుకు వీణావాణీలు తిరస్కరించారు. దీంతో వీణావాణీలు స్వయంగానే తెలుగు పరీక్షను రాశారు. నంబర్లు కన్పించక కొద్దిసేపు అయోమయం కాగా, పరీక్షలు రాయడానికి ఏర్పాటు చేసిన గదులు, విద్యార్థుల హాల్‌టికెట్ల నంబర్లతో అంటించిన నోటీసు బోర్డులో వీణావాణీల హాల్ టికెట్ నంబర్లు లేకపోవడంతో కొద్దిసేపు అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రతిభా హైస్కూల్లో 11 గదులను (2022188183 నుంచి 2022188402 వరకు) ఏర్పాటు చేశారు. అయితే వీణావాణీల నంబర్ మాత్రం 2022188403/404గా ఉన్నాయి. వారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో నోటీసుబోర్డులో అంటించలేదని స్కూల్ నిర్వాహకులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
తొలిసారి విడివిడిగా ఓటేసిన సబా- ఫరా
పట్నా : పుట్టుకతోనే తల భాగం అతుక్కొని పుట్టిన బిహారీ కవలలు సబా- ఫరా (23)లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కవలలు పట్నాసాహిబ్ నియోజకవర్గంలోని దిఘా అసెంబ్లీ పరిధిలోతమ ఓటు వేశారు. పట్నానగరంలోని సమన్ పురా ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరికి తొలిసారి వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించున్నారు. అప్పట్లో వీరిద్దరిని ఒక్కరుగానే పరిగణించి ఓటు గుర్తింపుకార్డు ఇచ్చారు. కానీ శారీరకంగా కలిసి ఉన్నంతమాత్రన వారి వ్యక్తిగత హక్కులను కాదనడం సరికాదని పట్నా జిల్లా కలెక్టర్ కుమార్ రవి వారిద్దరికి వేర్వేరు గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఈ కవలలిద్దరూ బాలీవుడ్ సల్మాన్‌ఖాన్‌కు వీరాభిమానులు. వారి గురించి తెలుసుకున్న సల్మాన ముంబాయికి పిలిపించుకున్నారు. వాళ్లిద్దరూ సల్మాన్‌కు రాఖీ కట్టి అభిమానం చాటుకున్నారు. వీరి కుటుంబానికి ప్రతి నెల రూ. 5వేల పెన్షన్ వచ్చేది. దానికి రూ. 20వేలకు పెంచాలని సుప్రీం కోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. -
మా ఇద్దరి కోరిక అదే!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని ఉందని అవిభక్త కవలలు వీణా– వాణీ తెలిపారు. భవిష్యత్తులో ఇంజినీర్, సైంటిస్ట్ కావాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న వీరి బాగోగులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటోంది. ఆపరేషన్ చేసి వీణా– వాణీలను విడదీయాలని ప్రభుత్వానికి తండ్రి మురళి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది తన పిల్లలిద్దరూ విడివిడిగా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అవిభక్త కవలలుగా పుట్టిన వీణా-వాణీలను విడదేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలించలేదు. విదేశాల నుంచి కూడా వైద్యులు వచ్చి వీరిని పరీక్షించారు. కానీ వారికి ఆపరేషన్ చేస్తే బతికే అవకాశాలు తక్కువని వైద్యులు అభిప్రాయపడడంతో వెనకడుగు వేయాల్సి వచ్చింది. పుట్టినప్పటి నుంచి నీలోఫర్ ఆసుపత్రిలోనే ఎక్కువ కాలం గడిపిన ఈ చిన్నారులను తర్వాత స్టేట్‌హోం తరలించారు. గతేడాది ఐదో తరగతి చదివిన వీణా–వాణీలకు ఐక్యూ బాగుండటంతో ఈ ఏడాది ఏడో తరగతికి ప్రమోట్ చేశారు. -
వీణావాణిలను పరామర్శించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్: అవిభక్త కవలలైన పదమూడేళ్ల వీణావాణిల గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నిలోఫర్ ఆస్పత్రి నుంచి స్టేట్ హోంకు వచ్చిననాటి నుంచి వారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారని, వారిది ప్రత్యేక పరిస్థితి కావడంతో సర్కారు కూడా వారిని అంతే ప్రత్యేకంగా కంటికి రెప్పలా చూసుకుంటోందని చెప్పారు. వారి చదువుకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం కల్పించింది. వీరి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఆదేశించడంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ వారి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు. వారి బాగోగుల కోసం ఏకంగా రూ.6.46 లక్షలను కేటాయించారు. ఈ మొత్తంలో వారిని అనుక్షణం జాగ్రత్తగా చూసుకునే అయాలకే రూ.4.32 లక్షలను కేటాయించారు. వారికి చదువులు చెప్పే కౌన్సిలర్ కోసం రూ.1.14 లక్షలు, నిర్వహణ కోసం మరో రూ.లక్ష కేటాయించారు. వీణావాణిల స్థితిగతులపై మంత్రి తుమ్మల ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు స్టేట్ హోంను సందర్శించిన మంత్రి శుక్రవారం మరోమారు వచ్చి వీణావాణిలను పలకరించారు. వారితో కాసేపు మాట్లాడి వారికి ఇంకేమి కావాలో అడిగి తెలుసుకున్నారు. విద్య, ఇతర సౌకర్యాలు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్టేట్ హోం సిబ్బందికి సూచించారు. -
వీణా-వాణీల ఆపరేషన్‌కు ఆస్ట్రేలియా బృందం సిద్దం
-
వీణా-వాణిల ఆపరేషన్‌కు ఆర్సీహెచ్ సుముఖత
మెల్బోర్న్: అవిభక్త కవలలు వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియాలోని ప్రపంచ ప్రఖ్యాత రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (ఆర్సీహెచ్) సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఈ ఆస్పత్రిని సందర్శించి వీణా-వాణిల శస్త్రచికిత్సపై వైద్య నిపుణులతో చర్చించారు. ఆర్సీహెచ్ వైద్యులు గతంలో చేసిన ఆపరేషన్ల గురించి నిరంజన్‌రెడ్డికి వివరించారు. వీణా-వాణిలకు ఆపరేషన్ చేసే విషయంపై సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో మరింత కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని నిరంజన్ రెడ్డి చెప్పారు. -
కలిసి పుట్టారు... డాక్టర్లకే పరీక్ష పెట్టారు..!
పట్నా: అవిభక్త కవలలు జన్మించడం గురించి అప్పుడప్పుడు వింటుంటాం. అయితే బిహార్ లో మాత్రం బుధవారం జన్మించిన అవిభక్త కవలలు డాక్టర్లకే పరీక్ష పెట్టారు. శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని ఇద్దరు చిన్నారులు పంచుకున్నట్లుగా పుట్టారు. ఓ చిన్నారుల జెండర్ విషయాలపై డాక్టర్లకు ఇప్పటికీ స్పష్టతలేదంటేనే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బిహార్ కు చెందిన శివరాణి దేవి, చోటా సింగ్ దంపతులు. అయితే నొప్పులు రావడంతో శివరాణిని కాన్పు కోసం బక్సార్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఇద్దరు శిశువులకు జన్మనిచ్చింది. అయితే చిన్నారులలో ఒకరు ఆడ శిశువు కాగా, మరో శిశువు జెండర్ ఏంటన్నది డాక్టర్లకు తెలియడం లేదు. చిన్నారుల పరిస్థితి కాస్త సీరియస్ గా ఉండటంతో సర్దార్ పటేల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రెండో శిశువు మగ శిశువు అయి ఉండొచ్చునని డాక్టర్ రాజ్ కుమార్ గుప్తా భావిస్తున్నారు. సాధారణంగా అవిభక్త కవలలు ఒకే జెండర్ వాళ్లు పుడతారని చెప్పారు. అయితే చిన్నారుల తండ్రికి మెడికల్ ఖర్చులు భరించే స్థోమత లేదంటున్నాడు. వీరికి ఇప్పటికే ఇద్దరు సంతానం ఉన్నారు. ఓ బాబు, ఓ పాప ఉండగా, ప్రస్తుత కాన్పులో చోటా సింగ్ భార్య కవలలకు జన్మినిచ్చింది. చిన్నారులకు మరికొన్ని రోజులపాటు మెరుగైన చికిత్స అందించాల్సి ఉంటుంది. వీరిని రక్షించుకోవాలంటే ఢిల్లీ లాంటి పెద్ద నగరాలలో చికిత్స ఇప్పించాల్సి ఉంటుందని, తాను మాములు ఫ్యాక్టరీ పనివాడినంటూ చోటా సింగ్ వాపోతున్నాడు. -
వీణా-వాణిలకు అపరేషన్ సాధ్యమే
హైదరాబాద్ : అవిభక్త కలవలు వీణా-వాణిలకు ఆపరేషన్ సాధ్యం అవుతుందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్-న్యూఢిల్లీ)కి చెందిన ముగ్గురు సభ్యుల న్యూరో వైద్యుల బృందం గురువారం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి విచ్చేశారు. అవిభక్త కవలలైన వీణ-వాణిల శస్త్రచికిత్సకు సాధ్యాసాధ్యాలు, వైద్య పరీక్షలు తదితర వాటిపై ఈ బృందం పరిశీలన జరిపింది. వీణా-వాణిలకు శస్త్రచికిత్స సాధ్యం అవుతుందని తెలిపారు. త్వరలో వీరిని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించినట్లు సమాచారం. కాగా వీణా-వాణీలకు దాదాపు ఐదు విడతల్లో సర్జరీలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు 9 నుంచి 12 నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉందని లండన్ వైద్యులు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. తాము ఇప్పటివరకు రెండుసార్లు అవిభక్త కవలలకు ఆపరేషన్లు చేశామని, వేరుపడ్డ ఆ నలుగురు కవలలు ఇప్పుడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. లండన్ వైద్యులను రప్పించి ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించింది. దీంతో ఎయిమ్స్ వైద్యులతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో వీణా-వాణిలను వైద్యులు పరిశీలించారు. ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం లండన్ వైద్యులతోనూ ఆ బృందం సమాలోచనలు జరుపనుంది. -
క్షేమంగా వెళ్ళి.. లాభంగా రండి..!
-
లండన్‌లో వీణావాణీల ఆపరేషన్..!
-
అవిభక్త కవలలుగా బిపాసా
ఏ ఆర్టిస్ట్‌కైనా మంచి పాత్ర చేసే అవకాశం వస్తే, అందులో ఒదిగిపోవడానికి శారీరకంగా, మానసికంగా ఎంత కష్టపడటానికైనా వెనుకాడరు. ప్రస్తుతం బిపాసా బసు ఆ పని మీదే ఉన్నారు. తన పదమూడేళ్ల కెరీర్లో చేయనటువంటి విభిన్నమైన పాత్రను ఆమె చేయనున్నారు. ఈ పాత్ర ద్వారా నటిగా తన దాహం కొంత మేరకు తీరుతుందని సన్నిహితులతో చెబుతున్నారట బిపాసా. ఆ పాత్ర విషయానికొస్తే.. థాయ్ చిత్రం ‘ఎలోన్’ ఆధారంగా హిందీలో ఓ చిత్రం రూపొందనుంది. అవిభక్త కవలల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో కవలల పాత్రను బిపాసా చేయనున్నారు. దీని గురించి ఆమె చెబుతూ - ‘‘సవాళ్లను ఎదుర్కోవడం నాకిష్టం. అందుకే ఈ సినిమా అంగీకరించాను. శారీరకంగా ఒకే విధంగా ఉండే కవలలు, మానసికంగా విభిన్నంగా ఉంటారు. అతుక్కుని పుట్టినా, మనస్తత్వాలు వేరు. ఈ రెండు కోణాలకు వ్యత్యాసం కనబర్చడానికి శాయశక్తులా కృషి చేస్తాను. అవిభక్త కవలల గురించి పత్రికల్లో చదివాను. టీవీల్లోనూ చూశాను. కానీ, వారి తీరుతెన్నులు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూడలేదు. అందుకే, వారికి సంబంధించిన కొన్ని లఘు చిత్రాలు చూస్తున్నా. ఈ నెల 20న షూటింగ్ ఆరంభం కానుంది. కచ్చితంగా నా కెరీర్లో ఎప్పటికీ చెప్పుకునే సినిమా అవుతుంది’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. ‘ఎలోన్’ చిత్రం ఆధారంగా దక్షిణాదిన రూపొందిన ‘చారులత’లో ప్రియమణి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ప్రియమణికి మంచి పేరొచ్చింది. మరి బిపాసాకి ఎలాంటి అనుభూతి మిగులుతుందో.