ఫస్ట్ బర్త్‌డే జరుపుకొన్న చిన్నారులు
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో అరుదైన ఘటన
అవిభక్త కవలలుగా పుట్టిన ఇద్దరు అబ్బాయిలను విజయవంతంగా వేరుచేసి వారికి పునర్జన్మనిచ్చింది అమెరికాలోని ఓ పిల్లల ఆసుపత్రి. వేరుచేశాక గత నెల 29న ఈ చిన్నారులు తొలి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో నివసిస్తున్న షనేకా రూఫిన్, టిమ్ దంపతులకు అవిభక్త కవల పిల్లలు జన్మించారు.
ఆ అబ్బాయిలకు అమరీ, జవార్ రూఫిన్ అని పేర్లు పెట్టుకున్నారు. కౌగిలించుకున్నట్లుగా ఎదురెదురుగా పొట్ట ప్రాంతమంతా అతుక్కుని పుట్టారు. పుట్టినప్పుడు ఇద్దరి బరువు కలిపి కేవలం 2.7 కేజీలు మాత్రమే. వాస్తవానికి అవిభక్తవ కవలల తల్లి షనేకా రూఫిన్ 12 వారాల గర్భంతో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నప్పుడు గర్భస్త శిశువులు అతుక్కున్నట్లు కనిపించింది.
పుట్టే చిన్నారులకు శారీరక సమస్యలు వస్తాయని, ఆనాడే తల్లిని వైద్యులు హెచ్చరించారు. తల్లి మనసు ఊరుకోదుగా. గర్భస్రావం చేయించుకోనని తెగేసి చెప్పింది. ఎలాగైనా నవమాసాలు మోసి పిల్లలకు జన్మనిస్తానని కరాఖండీగా చెప్పేసింది. భర్త టిమ్ సైతం ఆమె నిర్ణయానికి అడ్డుచెప్పలేదు. పిల్లలు అతుక్కుని పుడితే వచ్చే సమస్యలను పరిష్కారం కనుగొనేందుకు మరో ఆస్పత్రిని వెతికారు. అప్పుడే వాళ్లకు ‘చాప్’ చిల్డ్రెన్స్ ఆసుపత్రి ఆశాదీపంగా కనిపించింది.
సిజేరియన్ ఆపరేషన్ ద్వారా చిన్నారులను అతుక్కుని పుట్టినాసరే వేరుచేయవచ్చని అక్కడి వైద్యులు భరోసా ఇచ్చారు. పిల్లల ఉమ్మడి శరీరంలో పొట్టతోపాటు కాలేయంలో కొంత భాగం కలిసే ఉంది. పిల్లలకు 11 నెలల వయసు వచ్చాక ఆపరేషన్‌కు రంగం సిద్ధమైంది. ఆగస్ట్ 21వ తేదీన 24 మందికిపైగా నిష్ణాతులైన వైద్యులు, మత్తుమందు డాక్టర్లు, రేడియాలజిస్టులు, నర్సులు ఇలా భారీ వైద్యబృందం ఏకధాటిగా ఎనిమిది గంటలపాటు శ్రమించి చిన్నారులను విజయవంతంగా వేరుచేసింది.
పొట్టను వేరుచేసేటపుడు ఎలాంటి ఇన్ఫెక్షన్ కలగకుండా మెష్, ప్లాస్టిక్ సర్జరీ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించి వారిని వేరుచేశాక ఇద్దరి పొత్తి కడుపులను జాగ్రత్తగా బయటి నుంచి కుట్టేశారు. కొద్దిరోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణ తర్వాత చిన్నారులను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్‌కు ముందు ఆస్పత్రి యాజమాన్యం గత నెల 29వ తేదీన ఘనంగా వీళ్ల పుట్టినరోజు వేడుక జరిపింది.
‘‘ఇద్దరినీ ఇలా వేరువేరుగా చూడటం వర్ణనాతీతమైన అనుభూతినిస్తోంది’’ అని తల్లి రూఫిన్ ఆనందం వ్యక్తంచేశారు. టిమ్ దంపతులకు అంతకుముందే కైలమ్, అనోరా అనే ఇద్దరు పిల్లలున్నారు. ‘‘ఆపరేషన్ తర్వాత మా కుటుంబసభ్యుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఆనందమయ జీవన ప్రయాణాన్ని ఇక ఆరంభిస్తాం. దీనిని సుసాధ్యం చేసిన నిపుణుల బృందానికి మా కృతజ్ఞతలు’’ అని తల్లి చెప్పారు. ప్రతి 35వేల నుంచి 80వేల కవలల జననాల్లో ఇలా అవిభక్త కవలలు పుడతారని వైద్యశాస్త్రం చెబుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment