సాక్షి, ఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాను లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు సిద్ధమని ప్రకటించారు. కోర్టు గనుక తనకు ఈడీ అరెస్ట్ చేయదని అభయం ఇస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు. నేడు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో.. తాజాగా గురువారం ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారాయన.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఇవాళ హాజరు కావాలంటూ ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే తొమ్మిదిసార్లు సమన్లు జారీ అయ్యాయి. సమన్ల ఉల్లంఘన కింద ఈడీ సైతం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయగా.. ఆయన బెయిల్ దక్కించుకున్నారు.
అయితే లిక్కర్ కేసులో ఇవాళ తనను ఈడీ కచ్చితంగా అరెస్ట్ చేస్తుందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ ఉదయం ఢిల్లీ హైకోర్టులో హడావిడిగా మరో పిటిషన్ వేశారు. ఈడీ విచారణకు తాను సిద్ధమని, అరెస్ట్ కాకుండా తనకు రక్షణ కల్పించాలని, ఈడీ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్‌లో ఆయన అభ్యర్థించారు. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణ చేపట్టింది.
‘‘ నేనేం నేరస్తుడిని కాదు. పారిపోవాల్సిన అవసరం నాకేంటి?. సమాజంలో నా కంటే గట్టి మూలాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా?. ఈడీ విచారణకు నేను హాజరవుతా. వాళ్లు అడిగిందానికి సమాధానాలిస్తా. కానీ, నాకు రక్షణ కావాలి. కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వండి’’ అని కేజ్రీవాల్ హైకోర్టును అభ్యర్థించారు.
విచారణ చేపట్టడం అనేది దర్యాప్తు సంస్థల సాధారణ ప్రక్రియే అని.. మొదటిరోజో, రెండో రోజో అరెస్ట్ చేయడం జరగబోదని.. ముందుగా స్టేట్‌మెంట్‌లను రికార్డు చేయడం లాంటి చేపడుతుందని.. అరెస్ట్ చేస్తే కారణాలను సైతం వివరిస్తుందని కోర్టు కేజ్రీవాల్‌కు తెలిపింది. సమన్ల ప్రకారం ఆయన హాజరైతే స్థితిగతులను తెలుసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయినా అరెస్టు ఊహిస్తే తగిన చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించింది.
అయితే.. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అలాంటి పద్ధుతులు పాటించడం లేదని.. కొత్త తరహాలో వ్యవహరిస్తున్నాయని సింఘ్వీ బెంచ్ ముందు వాదించారు. మరోవైపు నిందితుడిగానో, అనుమానితుడిగానో కేజ్రీవాల్ పేరును ప్రస్తావించకుండా ఈడీ సమన్లు పంపిందని సింఘ్వీ బెంచ్ వద్ద ప్రస్తావించారు.
మరోవైపు.. బుధవారం కేజ్రీవాల్ దాఖలు చేసిన మరో పిటిషన్ విచారణ సందర్భంగా.. ఈడీ ఎదుట ఎందుకు హాజరుకావడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అయితే.. ఎన్నికల వేళ తనను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని.. అందుకే హజరు కావడం లేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment