బారాముల్లా, సొపోర్‌లలో 30 ఏళ్లలోనే అత్యధికం
జమ్మూ/శ్రీశ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడో విడతలో మంగళవారం జరిగిన పోలింగ్‌లో 68.72 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు మించి జనం ఓటేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏడు జిల్లాల్లో 66.78% ఓటింగ్ నమోదైంది. ఎప్పుడూ ఎన్నికలను బహిష్కరించే బారాముల్లా, సొపోర్ అసెంబ్లీ స్థానాల్లో 30 ఏళ్లలోనే అత్యధికంగా ఈసారి జనం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని ఈసీ తెలిపింది.
అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య జమ్మూకశ్మీర్‌లోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా పశ్చిమ పాకిస్తానీ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపించారు. అత్యధికంగా సాంబాలో 73.45%, ఉధంపూర్‌లో 72.91% మంది ఓటేయగా, కథువా లో 70.53%, జమ్మూలో 66.79%, బందిపొరాలో 64.85%, కుప్వారాలో 62.76%, బారాముల్లాలో 55.73% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
జమ్మూ జిల్లాలోని ఛాంబ్ నియోజకవర్గంలో అత్యధికంగా 77.35 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ వివరించింది. సొపోర్ నియోజకవర్గంలో 41.44%, బారాముల్లా అసెంబ్లీ స్థానంలో 47.95% మంది ఓటు వేశారు. గత 30 ఏళ్ల ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధికమని ఈసీ తెలిపింది. గతంలో ఇక్కడ తరచూ ఎన్నికలను బహిష్కరించే ఆనవాయితీ నడిచిందని పేర్కొంది. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా మూడు విడతల్లో కలిపి ఓటింగ్ శాతం 63.45 అని ఈసీ పేర్కొంది. మూడో విడత పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఈసీ పేర్కొంది. ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, రీపోలింగ్ అవసరం కూడా లేదని వివరించింది. ఈ నెల 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment